తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎంపిక అంతులేని కథలా కొనసాగుతోంది. అదిగో ప్రకటిస్తారు.. ఇదిగో ప్రకటిస్తారు అంటూ ఆరు నెలలుగా అదే సస్పెన్స్ ను కొనసాగిస్తున్నారు. ఈటల రాజేందర్ ను ప్రెసిడెంట్ గా ఫిక్స్ చేశారని బీజేపీ వర్గాల్లో జోరుగా జరుగుతోన్న చర్చ. అయినా , అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడటం లేదు.
కామన్‌గా కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడి ఎంపికపై సాగదీస్తుంటారు. నెలల తరబడి లెక్కలు,సమీకరణాలు, సీనియర్లు, జూనియర్లు.. అని అనేకానేక చర్చోపచర్చల తర్వాత అధ్యక్షుడిని ప్రకటిస్తారు.కానీ బీజేపీలో డిఫరెంట్. అధిష్టానం అనుకుంది అంటే.. పేరు బయటకు వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఆ బీజేపీ కూడా కాంగ్రెస్ బాటలో నడుస్తోందా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంలోలా దూకుడు నిర్ణయాలు ఆ పార్టీలో కనిపించడం లేదు.
ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి.. కేంద్రమంత్రిగా కూడా కొనసాగుతుండటంతో , పార్టీపై ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నారు. పార్టీ తరఫున ప్రభుత్వ వ్యతిరేక పోరాటకార్యాచరణ కూడా పెద్దగా ఉండటం లేదనే అభిప్రాయం పార్టీలోనూ వినిపిస్తోంది. బీఆర్ఎస్ కూడా దీన్ని ఎక్కువగా ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ తో బీజేపీ లాలూచీపడిందని, అందుకే ప్రభుత్వంపై బీజేపీ ప్రత్యక్ష ప్రజా పోరాటానికి దిగడం లేదని విమర్శిస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి తెలంగాణలో మంచి ఆదరణ ఉంటుందని నిరూపితమైంది. ఆ రిజల్ట్ తర్వాత అయినా అధ్యక్షుడిని ప్రకటిస్తారని భావిస్తే అదే ఆలస్యం కొనసాగుతోంది. కొత్త అధ్యక్షుడు వచ్చాకే పార్టీ కార్యక్రమాల్లో కొంత కదలిక వస్తుందని క్యాడర్ నమ్ముతోంది. కానీ, అధిష్టానం మాత్రం ఎందుకో నెలల తరబడి ప్రెసిడెంట్ పోస్ట్ ను పెండింగ్ లో పెడుతోంది. ఈటలకు ఎడ్జ్ కనిపిస్తున్నా.. తెరవెనక కొంతమంది అడ్డుపుల్లలు వేస్తున్నారని అందుకే ఆలస్యం అవుతుందని కమలం కాంపౌండ్ లో వినిపిస్తున్న మాట.