ప్రభుత్వం రద్దయిన మరుక్షణం నుంచే… ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని.. ఈసీ ప్రకటించడం తెలంగాణ ప్రభుత్వానికి ఓ రకంగా షాక్. నోటిఫికేషన్ వచ్చే వరకూ కోడ్ ఉండదని.. ఈ లోపే.. బతుకమ్మ చీరలు, రైతు బంధు చెక్కులు పంపిణీ చేస్తే పనైపోతుందని.. అనుకుంది. కానీ చీరల పంపిణి ఆగిపోయింది. చెక్కుల పంపిణీని మాత్రం.. సైలెంట్‌గా ప్రారంభించాలని నిర్ణయించుకుంది. కోడ్ వర్తిస్తుందన్న అనుమానంతో, పెద్ద హడావుడి లేకుండా ఏర్పాట్లు చేశాకుయ
రైతుబంధు చెక్కులను జిల్లాలకు తరలించే ప్రక్రియను రాష్ట్ర వ్యవసాయ శాఖ మొదలుపెట్టింది. మొత్తం 19 జిల్లాల్లోని 118 మండలాలకు అధికారులు ఇప్పటికే చెక్కులు తరలించారు. ఆంధ్రాబ్యాంక్, టీఎస్కాబ్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ లనుంచి సుమారు 11 లక్షల చెక్కులు జిల్లాలకు చేరాయి. రైతుబంధు పథకం అమలుకోసం రాష్ట్రంలో నగదును అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఇప్పటికే ఆర్బీఐకి లేఖ రాశారు. ఈ మేరకు అవసరానికి తగ్గట్లుగా నగదు అందుబాటులో ఉంచుతామని ఆర్బీఐ వర్గాలు రాష్ట్రానికి తెలిపినట్లు తెలుస్తోంది. బ్యాంకుల్లో నగదు అందుబాటును బట్టి సుమారు నెల నుంచి నలభై రోజుల పాటు చెక్కుల పంపిణీ ప్రక్రియ కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
కొనసాగుతున్న పథకాలకు ఎన్నికల కోడ్ వర్తించక పోవచ్చనేది అధికారుల అభిప్రాయం. ఒకవేళ పథకం ఆపమంటూ విపక్షాలు ఫిర్యాదు చేసినా, రైతుబంధు పథకానికి ఈసీ అడ్డు చెప్పక పోవచ్చనే అభిప్రాయపడుతున్నారు. పథకం కోసం 2018 – 19 బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయి. తొలి విడతగా ఖరీఫ్ సీజన్ లో సుమారు 53 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి 4 వేల చొప్పున చెక్కుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
బతుకమ్మ పండుగకు చీరల పంపిణీని నిలిపివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నది. బతుకమ్మ చీరలతోపాటు రాష్ట్రంలో రైతుబంధు పథకాన్ని కూడా నిలిపివేయాలని కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పార్టీలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ తీసుకోబోయే నిర్ణయమే ఉత్కంఠ రేకెత్తిస్తోంది.