సావిత్రి నటించిన సినిమాల్లో ‘మాయాబజార్’ది స్పెషల్ ప్లేస్. ఆమె జీవితం ఆధారంగా తీసిన ‘మహానటి’లో ‘మాయాబజార్’లోని కొంత భాగాన్ని రిక్రియేట్ చేశారు. ‘మాయాబజార్’ అంటే అందులో కృష్ణుడిగా నటించిన ఎన్టీఆర్, అభిమన్యుడిగా చేసిన ఏయన్నార్లను చూపించారా? లేదా? అనేది డౌట్. ఘటోత్కచుడిగా ఎస్వీ రంగారావు చేసిన పాత్రను మోహన్ బాబు పోషించారు. ఈ సినిమా సంగతి తీసేసినా… ఎన్టీఆర్, ఏయన్నార్ పక్కన సావిత్రి ఎన్నో హిట్ సినిమాలు చేశారు. ఆమె జీవితంపై సినిమా అంటే వాళ్లిద్దరి పాత్రలు తప్పనిసరి. ఏయన్నార్ పాత్రలో ఆయన మనవడు అక్కినేని నాగచైతన్య చేశాడు. ఎన్టీఆర్ పాత్రకు ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్‌ని అడిగారు. అతను చేయనని ఖరాఖండిగా చెప్పేశాడు. తనకంత దమ్ము లేదని ఆడియో వేడుకలో మాట్లాడారు. మరి, ఎన్టీఆర్ పాత్రని సినిమాలో ఎలా సృష్టించారు? అనేది పజిల్ అయ్యింది. ‘యమదొంగ’లో రాజమౌళి చూపించినట్టు డిజిటలైజేషన్ చేశారని వార్తలొచ్చాయి. దర్శకుడు నాగ అశ్విన్‌ని అదే విషయం అడిగితే… “కొన్ని గంటల్లో సినిమా విడుదలవుతుంది. చూడండి. అభిమానులకు, ప్రేక్షకులకు నచ్చేలా ఏదో చేశాం” అంటున్నారు. నానీని ఎన్టీఆర్ పాత్ర చేయమని అడిగారా? అంటే… “లేదు. లేదు. ఒక్క తారక్ (జూనియర్ ఎన్టీఆర్)ని తప్ప ఎవర్నీ అడగలేదు. నానీని ఏ పాత్రకు అడిగాననే విషయం విడుదల తరవాత చెప్తా” అన్నారు. చివరకి, ఎన్టీఆర్ పాత్రని ఏం చేశారనేది మాత్రం చెప్పలేదు.
‘మహానటి’ సినిమాలో సావిత్రి నటించిన సినిమాల విషయానికి వస్తే… ఆమె నటించిన సూపర్ హిట్ సినిమాల్లో పదకొండు సినిమాలను టచ్ చేశార్ట. టైటిల్ సాంగులో సావిత్రి జీవితానికి సంబంధించిన వంద విషయాలను మాంటేజ్ రూపంలో చూపించార్ట. కేవీ రెడ్డి పాత్రలో దర్శకుడు క్రిష్ అద్భుతంగా నటించారని దర్శకుడు నాగఅశ్విన్ తెలిపారు.