తెలుగుదేశం పార్టీ విప్‌ను ధిక్కరించిన ఇద్దరు ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్ రెడ్డిలపై అనర్హతా వేటు వేయాలని.. ఆ పార్టీ .. శాసనమండలి చైర్మన్‌కు సిఫార్సు చేసింది. అసెంబ్లీలో రూల్ నెంబర్ 71పై జరిగిన చర్చలో.. అనుకూలంగా ఓటు వేయాలని టీడీపీ విప్ జారీ చేసింది. అయితే.. ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు మాత్రం.. వ్యతిరేకంగా.. వైసీపీకి మద్దతుగా ఓటేశారు. దీంతో.. టీడీపీ అగ్రనేతలు షాక్ తిన్నారు. వీరిని ఇలా క్షమించకూడదని నిర్ణయించుకుని.. వెంటనే.. అనర్హతా పిటిషన్ దాఖలు చేశారు. మండలి చైర్మన్ షరీఫ్.. ఈ పిటిషన్లపై.. ఈ సమావేశాలు ముగిసేలోపు లేదా.. ఆ తర్వాత వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
వైసీపీకి మద్దతుగా నిలిచిన టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతది.. ఏపీ కాదు. ఆమెది మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. ఆమె భర్త పోతుల సురేష్.. పరిటాల రవి ఆర్వోసీలో కీలక బాధ్యతల్లో ఉండేవారు. రవి హత్య తర్వాత వారు ఆజ్ఞాతంలోకి వెళ్లి… వైఎస్ మరణం తర్వాత… రోశయ్య హయాంలో లొంగిపోయారు. అప్పుడు టీడీపీ.. అధినేత.. వారికి రాజకీయ భవిష్యత్ కల్పించారు. ప్రకాశం జిల్లా చీరాలకు ..ఆమెకు ఏ సంబంధం లేకపోయినా.. అక్కడ ఇన్చార్జ్ పోస్టు ఇచ్చారు. 2014లో టిక్కెట్ కూడా ఇచ్చారు. కానీ అక్కడ ఆమంచి చేతిలో ఓడిపోయారు. ఆమంచి టీడీపీలో చేరడంతో.. ఆమెకు అన్యాయం జరగకుండా.. ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీ తమకు ఇబ్బందులున్నాయంటూ.. ఆమె వైసీపీ వైపు మొగ్గు చూపారు.
మరో ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి.. బీజేపీలో చేరిన ఆదినారాయణరెడ్డి సోదరుడి కుమారుడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బద్ధ శత్రువులు అయిన ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిల మధ్య రాజీ కుదుర్చిన చంద్రబాబు.. అసెంబ్లీ టిక్కెట్ ను రామసుబ్బారెడ్డికి కేటాయించారు. ఎమ్మెల్సీ పదవికి రామసుబ్బారెడ్డి రాజీనామా చేశారు. ఆ స్థానాన్ని ఆదినారాయణరెడ్డి సోదరుడి కుమారుడికి ఇచ్చారు. ఆ సోదరుడి కుమారుడు.. ఇప్పుడు విప్ ను ధిక్కరించి.. వైసీపీకి మద్దతుగా నిలిచారు. వీరిద్దరిపై అనర్హతా వేటు వేస్తే.. ఆ రెండు స్థానాల్లోనూ వచ్చే ఉపఎన్నికల్లో వైసీపీ నిలబెట్టిన వారే గెలుస్తారు. అయితే.. ఆ స్థానాలు వీరిద్దరికే కేటాయిస్తారా లేదా.. అన్నది మాత్రం డౌటే.