ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో కొద్ది మంది నేతల్ని రాత్రికి రాత్రి సస్పెండ్ చేస్తూండటం… ఆ పార్టీలో రచ్చకు దారి తీస్తోంది. వీరంతా.. గతంలో కన్నా లక్ష్మినారాయణ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కండువా కప్పుకున్నవాళ్లే. ఎక్కువ మంది అమరావతికి మద్దతుగా వాయిస్ వినిపిస్తున్న వాళ్లే. రాయలసీమకు చెందిన ఓవీ రమణ అనే నేతను రాత్రికి రాత్రి సస్పెండ్ చేయడంతో.. ఆయన మీడియా ముందుకు వచ్చి.. సోము వీర్రాజుపై ఆరోపణలు ప్రారంభించారు. తాను అమరావతికి మద్దతుగా ఓ పత్రికకు ఆర్టికల్ రాశానని.. తనపై సస్పెన్షన్ వేటు వేశారని… ఆయన మండిపడ్డారు. ఓవీ రమణ మాత్రమే అమరావతికి మద్దతుగా మాట్లాడుతున్న కొంత మంది బీజేపీ నేతలపై.. సోము వీర్రాజు రాగానే వేటు పడింది. కొంత మంది నేతలకు.. షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు.
టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లి అక్కడ అధికార ప్రతినిధిగా ఉన్న లంకా దినకర్‌కు కూడా షోకాజ్ నోటీసు జారీ చేశారని.. సాక్షి పత్రికలో ప్రచారం చేశారు. ఆ సందర్భంగా ఆయనపై… సాక్షి పత్రిక అనేక ఆరోపణలు చేసింది. దీనిపై… లంకా దినకర్ ఆ పత్రికకు లీగల్ నోటీసులు ఇచ్చారు. కానీ బీజేపీ వైపు నుంచి ఆయనకు కనీస మాత్రం మద్దతు కనిపించలేదు. ఓ వైపు అమరావతికే మా మద్దతు కానీ కేంద్రం జోక్యం చేసుకోదంటూ… బీజేపీ ఆడుతున్న పొలిటికల్ గేమ్‌లో… చాలా మంది తమ పార్టీ వ్యూహాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అమరావతికే మద్దతంటున్నారు కదా అని… ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అసలే సోము వీర్రాజు.. ఆయన వైసీపీని ఎవరైనా ఏమైనా అంటే.. ఊరుకోని పరిస్థితి. అందుకే సస్పెండ్ చేస్తున్నారని ఆ నేతలు మండి పడుతున్నారు.
సస్పెన్షన్ వేటు వేస్తున్నా పలువురు నేతలు అమరావతికి మద్దతుగా మాట్లాడుతూనే ఉన్నారు. దీంతో.. జీవీఎల్ నరసింహారావు.. తమ విధానం గురించి ఢిల్లీలో ఓ క్లారిటీ ఇచ్చారు. అందులోనూ క్లారిటీ లేదు. తమ మద్దతు అమరావతికే కానీ.. కేంద్రం జోక్యం చేసుకోదంటూ మళ్లీ చెప్పారు. బహుశా ఆయన ఉద్దేశం.. ఇక అమరావతి గురించి మాట్లాడటం మానేయాలని కావొచ్చు. కానీ ఇక్కడి బీజేపీ నేతలు .. అమరావతి గురించి మాత్రమే మాట్లాడాలనుకుంటున్నారు. అక్కడే సమస్య వస్తోంది. త్వరలో ఏపీ బీజేపీలో పెద్ద రచ్చే జరిగే అవకాశం కనిపిస్తోంది.