రాజేంద్రప్రసాద్ – కృష్ణారెడ్డి.. ఓ సూపర్ హిట్ కాంబో. ‘కొబ్బరిబొండాం’, ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’, ‘మాయలోడు’.. ఇలా హ్యాట్రిక్ కొట్టారు. అయితే ఆ తరవాత ఇద్దరూ కలిసి పని చేయలేదు. ఇద్దరి మధ్యా అప్పట్లో ఈగో క్లాషెష్ వచ్చాయని గట్టిగానే ప్రచారం జరిగింది. అయితే రాజేంద్రప్రసాద్ గానీ, కృష్ణారెడ్డి గానీ ఈ విషయంపై పెద్దగా మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఎట్టకేలకు ఆ రోజుల్లో ఏం జరిగిందో.. కృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి చెప్పేశారు.
అది ‘మాయలోడు’ షూటింగ్ జరుగుతున్న రోజులు. ‘చినుకు చినుకు అందెలతో’ అనే పాట కోసం సౌందర్య కాల్షీట్లు సంపాదించారు కృష్ణారెడ్డి. ఆరోజుల్లో సౌందర్య ఫుల్ బిజీ. తన డేట్లు దొరకడమే కష్టం. ఎలాగోలా దొరికాయి. వెంటనే రాజేంద్ర ప్రసాద్ కి ఫోన్ చేసి `సౌందర్య డేట్లు దొరికాయి.. మనం షూటింగ్ పెట్టుకొందాం` అని అడిగితే, ‘సౌందర్య ఇచ్చిన డేట్లకు నా డేట్లు ఎడ్జిట్ చేయాలా?’ అంటూ ఈగోకి పోయార్ట రాజేంద్రప్రసాద్. అప్పటికే.. రాజేంద్ర ప్రసాద్, కృష్ణారెడ్డి మధ్య కాస్త కోల్డ్ వార్ నడుస్తోంది. దాన్ని మనసులో పెట్టుకొని ‘మాయలేడు’ షూటింగ్ విషయంలో రాజేంద్ర ప్రసాద్ అప్పటికే చాలాసార్లు ఇబ్బంది పెడుతూ వచ్చార్ట. మరోవైపు ‘మాయలోడు’ రిలీజ్‌డేట్ ఫిక్సయిపోయింది. రాజేంద్ర ప్రసాద్ డబ్బింగ్ కూడా చెప్పలేదు. ఓ పాట కూడా పూర్తి చేయాలి. రాజేంద్ర ప్రసాద్ ఏమో.. షూటింగ్ కి రావడానికి మొండికేస్తున్నాడు. అలాంటి సమయంలోనే కృష్ణారెడ్డి మదిలో… బాబూ మోహన్ రూపం మెదిలింది. రాజేంద్ర ప్రసాద్ పాటని బాబూ మోహన్ తో చేయిస్తే ఎలా ఉంటుంది? అని ఆలోచించారు. వెంటనే బాబూ మోహన్‌కి ఫోన్ కొట్టారు. అన్నపూర్ణ స్టూడియోలో ఓ ఫ్లోర్ బుక్ చేశారు. మరోవైపు కనీసం మూడు రోజుల్లో పూర్తవ్వాల్సిన డబ్బింగ్ ప్రసహనాన్ని.. కేవలం నాలుగు గంటల్లోనే పూర్తి చేసి రాజేంద్రప్రసాద్ ని ఇంటికి పంపేశారు కృష్ణారెడ్డి. పాట పూర్తి కాకుండా సినిమా విడుదల అవ్వదు కదా అని రాజేంద్ర ప్రసాద్ కూడా ధీమాగానే ఉన్నారు. అయితే సడన్‌గా`చినుకు చినుకు` పాటని బబూ మోహన్‌తో చేయిస్తున్నారన్న వార్త రాజేంద్ర ప్రసాద్ చెవిన పడింది. దాంతో.. ఎస్వీ కృష్ణారెడ్డి దగ్గరకు మేనేజర్ని రాయబారానికి పంపారు. ‘బాబూ మోహన్‌తో పాట చేయిస్తే… సినిమా నాశనం అయిపోతుందని, రాజేంద్ర ప్రసాద్ ఈ పాట చేయడానికి రెడీగానే ఉన్నార’ని మేనేజర్‌తో చెప్పించారు. కానీ కృష్ణారెడ్డి మాత్రం వెనుకంజ వేయలేదు. తాను బాబూ మోహన్‌కి మాట ఇచ్చేశానని, ఈ పాట చేస్తే బాబూ మోహన్‌తో చేస్తానని పట్టుపట్టారు. ఆఖరికి షూటింగ్ రోజున కూడా రాజేంద్రప్రసాద్ స్పాట్ కి వచ్చి.. ‘ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు.. ఈ పాట నేనే చేస్తా’ అని చెప్పినా కృష్ణారెడ్డి ససేమీరా అన్నార్ట. అలా ‘చినుకు చినుకు అందెలతో’ పాట రాజేంద్ర ప్రసాద్ చేతిలోంచి బాబూ మోహన్ చేతిలోకి జారిపోయింది.
అసలు సౌందర్య ఎక్కడ? బాబూ మోహన్ ఎక్కడ? ఇద్దరూ కలిసి డాన్సు చేయడం ఏమిటి? అనే ఆశ్చర్యంతోనే జనాలు థియూటర్లకు వచ్చారు. కానీ బాబూ మోహన్ స్టెప్పులకు షాకై.. ఆ పాట కోసమే మళ్లీ మళ్లీ సినిమా చూశారు. అలా `చినుకు చినుకు` పాట ఓ సన్సేషనల్ అయిపోయింది.