కర్నూలు ఎం.ఎల్.ఏ ఎస్.వి.మోహనరెడ్డి తెలివైన నాయకుడే గాని కొన్నిసార్లు నోరు జారుతుంటారు. అయితే దానికీ కొన్ని హద్దులుంటాయి. నంద్యాల ఉప ఎన్నికల కోసం ముందే హౌరాహరీ పోరాటం జరుగుతుంటే హాస్యం పేరిట ఆయన అసందర్భ వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా వుంది. ఆయన చెల్లెలు శోభ, బావ భూమా నాగిరెడ్డి మరణాలు అందరిలో సానుభూతి కలిగించాయి. ఆ సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి కుమార్తె అఖిలప్రియను మంత్రిని చేసి, రాయలసీమలో సామాజిక వర్గ సమీకరణాలు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. వారి బందువైన బ్రహ్మానందరెడ్డిని పోటీ చేయిస్తున్నారు. మాజీ మంత్రి శిల్పా మోహనరెడ్డి వైసీపీలో చేరి అభ్యర్థిగా రావడంతో ఇది సంకుల సమరంగా మారిపోయింది. ముఖ్యమంత్రి ఆయన కుమారుడు మాత్రమే గాక టిడిపి హేమాహేమీలంతా దిగడం తథ్యం. ఎందుకంటే ఇది గేమ్ ఛేంజర్ అనుకుంటున్నారు. ఇలాటి సమయంలో అక్కడ చంద్రబాబు వ్యాఖ్యలే మొదటి వివాదం రేపాయి. తర్వాత జిల్లా టిడిపి అద్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు టిడిపిలో చేరితే రౌడీ షీటర్లు ఎత్తేస్తామన్నట్టు చెప్పడం ఇంకా వివాదమైంది. ఇక తాజాగా వైవీ మోహనరెడ్డి నంద్యాలకు ఎక్కడ లేని వరాల వర్షం కురుస్తున్నదని, పదవుల పంట పండుతున్నదని వేదికపైనే చెప్పారు. అంతటితో ఆగక మా ఎంఎల్ఎ కూడా పోతే బాగుండునని అందరూ అనుకుంటున్నారని నవ్వుతూ వ్యాఖ్యానించడం అందరికీ దిగ్భ్రాంతపర్చింది. చనిపోయిన వ్యక్తుల గురించి అందులోనూ బావ గురించి ఇలా అనడం వూహకందని విషయమే.అయితే అక్కడ వాతావరణం అలా వుంది మరి! ఇకనైనా మన నాయకుల నాలుకలకు విజ్ఞత కలుగు గాక.