తెలుగు సినిమా గర్వించగిన నటుల్లో ఎస్వీఆర్‌ది మొదటి స్థానం. ఏ పాత్రనైనా అవలీలగా పోషిస్తారు. సహజత్వాన్ని ఆపాదిస్తారు. ఆ పాత్ర ఆయన తప్ప ఇంకెవ్వరూ చేయలేరన్న అభిప్రాయాన్ని ప్రేక్షకుల్లో బలంగా నాటకుపోయేలా చేస్తారు. ఆయన పాత్రలు, చేసిన సినిమాలు, చెప్పిన డైలాగులూ అన్నీ – అద్భుతాలకు తీసిపోవు. అయితే కళాకారులకు ఒకటో రెండో బలహీనతలు ఉంటాయి. ఎస్వీఆర్‌కీ అది ఉంది. ఆయన మద్యానికి బానిస. పగలంతా కష్టపడి షూటింగ్ చేస్తారు. రాత్రయితే… ఫ్లూటుగా తాగేస్తారు. ఆయనతో షూటింగ్ అంటే… చాలా కష్టమని, చెప్పిన సమయానికి ఆయన సెట్ కు రారని నిర్మాతలందరికీ తెలుసు. అయినా సరే, ఎస్వీఆర్లోని నటుడి కోసం అవన్నీ ఇష్టంగానే భరిస్తారు. ఎస్వీఆర్ సినిమాల కోసం మద్యం ముట్టని సందర్భాలు ఆయన జీవితంలో రెండే రెండున్నాయి. ఆ రెండూ.. కృష్ణ సినిమాలే. పద్మాలయా సంస్థ నుంచి వచ్చిన సినిమాల కోసం… ఓ నిర్మాతగా తన సినిమా శ్రేయస్సుని కాంక్షించి, ఎస్వీఆర్‌తో మద్యం మాన్పించారు కృష్ణ.
`పండంటి కాపురం` తెరకెక్కిస్తున్న రోజులవి. ఆ సినిమాలో హేమాహేమీలాంటి నటీనటులున్నారు. భానుమతిని ఓ పాత్ర కోసం తీసుకోవాలన్నది కృష్ణ ఆలోచన. అయితే.. భానుమతిని భరించడం కష్టమని, ఆమె కోసం అనుకున్న పాత్రలో జమునని ఎంచుకున్నారు. ఇలా… తనని కావాలని ఓ సినిమా కోసం పక్కన పెట్టారన్నది భానుమతికి తెలిసింది. దాంతో పంతం కొద్దీ.. `పండంటి కాపురం`కి పోటీగా ఆమె కూడా అదే జోనర్లో ఓ సినిమాని మొదలెట్టేశారు. ఈ విషయం… ఎస్వీఆర్‌కి తెలిసింది. `మనకు పోటీగా సినిమా తీయడమా? ఇది భావ్యం కాదు. మనమంతా బాగా కష్టపడి, ఈసినిమాని త్వరగా పూర్తి చేయాలి. అందుకోసం నేనేమైనా చేస్తా.. కావాలంటే.. మందు మానేస్తా` అని సెట్లో అందరి ముందూ ఎస్వీఆర్ వాగ్దానం చేశారు. అన్నట్టే.. ఆ మాటపై నిలబడి, ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యేంత వరకూ.. ఆయన మద్యం జోలికిపోలేదు. ఎస్వీఆర్ కమిట్మెంట్ తో అనుకున్న దానికంటే ఆ సినిమా త్వరగా పూర్తయిపోయింది.
ఆ వెంటనే… `దేవుడు చేసిన మనుషులు` సినిమా మొదలైంది. దీనికి కృష్ణనే నిర్మాత. ఈ సినిమాలోనూ ఎస్వీఆర్ కి ఓ మంచి పాత్ర దక్కింది. అయితే పారితోషికం విషయంలో ఎస్వీఆర్ అసంతృప్తితో ఉన్నారు. `పండంటి కాపురం సినిమాకి 30 వేలే ఇచ్చారు. ఈ సినిమాకీ అంతే ఇస్తానంటే కుదరదు` అని నిర్మొహమాటంగా చెప్పేశారు ఎస్వీఆర్. `మీరు ఈ సినిమా పూర్తయ్యేంత వరకూ మందు మానేస్తా అని మాటిస్తే, మరో 20 వేలు ఇస్తా..` అని కృష్ణ చెప్పడంతో ఎస్వీఆర్ సరే అన్నారు. అలా.. ఈ సినిమా పూర్తయ్యేంత వరకూ ఎస్వీఆర్ మద్యపానం జోలికి వెళ్లలేదు. ఈ సినిమా షూటింగ్ కూడా అనుకున్నదానికంటే ముందే పూర్తయిపోయింది. దాంతో.. కృష్ణ ఎస్వీఆర్‌కి 50 వేల పారితోషికం ఇచ్చారు.