టీటీడీ పోస్టుల తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఎస్వీబీసీ చైర్మన్ పోస్టుపై పడింది. టీటీడీ అనుబంధ విభాగాల్లో కీలకమైన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ ఛైర్మన్ పదవి పలుకుబడి ఉన్నదికావడంతో టిడిపి, జనసేన, బిజెపి నుంచి ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. వీరితోపాటు ఎస్వీబీసీ ఈసీవో, అడ్వైజర్, చీఫ్ అడ్వయిజర్ పదవుల భర్తీ కోసం కసరత్తు జరుగుతోంది.
ఈ పదవికి టీడీపీ మొదటి నుంచి సినిమా వాళ్లకు ప్రాధాన్యం ఇస్తోంది. 2018లో అప్పటి టిడిపి ప్రభుత్వం సినీ దర్శకుడు రాఘవేంద్రరావును ఛైర్మన్గా నియమించింది. 2019లో వైసిపి అధికారంలోకి రావడంతో ఆ పదవికి ఆయన రాజీనామా చేశారు. అనంతరం వైసిపి ప్రభుత్వం ఆ పోస్టుకు సినీనటుడు పృధ్వీని నియమించింది. పలు వివాదాలు చుట్టుముట్టడంతో ఆ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత సాయికృష్ణ యాచేంద్ర మూడేళ్లు ఆ పదవిలో ఉన్నారు.
ఈ సారి ఎస్వీబీసీ చైర్మన్ పదవి కోసం జర్నలిస్టు వర్గాల నుంచి కూడా పోటీ ఉన్నట్లుగా తెలుస్తోంది. సినిమా వాళ్లు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు ఈ సారి ఒకే పాలసీ పెట్టుకున్నారు పార్టీ కోసం పని చేసిన వారినే ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా వాళ్లలో కొంత మందిపేర్లు షార్ట్ లిస్ట్ అయ్యాయని.. జనసేన వైపు నుంచీ గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు.