క్రిందటి ఏడాది అక్టోబర్ రెండవ తేదీ మహాత్మాగాంధీ జయంతి రోజున ఎంతో ఆర్భాటంగా ప్రధనమంత్రి మోదీ ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ (క్లీన్ ఇండియా) పథకం ఏడాదితిరగకుండానే నీరసించిపోతున్నదా ? ప్రభుత్వ అధికారులు ఒకరొకరిగా జారుకుంటుంటే, ఇది నిజమేనేమోననిపిస్తోంది. స్వచ్ఛ్ భారత్ మిషన్ హెడ్ గా భాద్యతలను అందిపుచ్చుకుని ఏడాదికాకముందే సీనియర్ ఐఏఎస్ అధికారిణి విజయలక్ష్మి జోషి వ్యక్తిగత కారణాలదృష్ట్యా బాధ్యతలనుంచి తప్పుకోవాలనుకుంటున్నారు. తాను స్వచ్ఛంధ విరమణ తీసుకోవాలనుకుంటున్నాననీ, తనను అక్టోబర్ 31నాటికి రిలీవ్ చేయాలని జులై14న ఆమె లేఖరాశారు.
విజయలక్ష్మి గుజరాత్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్. 1980 బ్యాచ్ కి చెందిన ఈ ఐఏఎస్ ఆఫీసర్ మరో మూడేళ్లలో రిటైర్ కాబోతుండగా, ఇప్పటికిప్పుడు హడావుడిగా వాలెంటరీ రిటైర్ మెంట్ కి అర్జీపెట్టుకోవడం చర్చనీయాంశమైంది. మహాత్మాగాంధీ ఆశయాలసాధన కోసం అట్టహాసంగా స్వచ్ఛ్ భారత్ ప్రారంభించిన తర్వాత ప్రధాని మోదీ తొమ్మిదిమంది సెలెబ్రిటీస్ ని ఎంపికచేసి అనుసంధాన కర్తలుగా మార్చుకున్నారు. ప్రధాని నామినేట్ చేసినవారిలో గోవా గవర్నర్ మ్రిదుల సిన్హ, క్రికెట్ లెజెండ్ సచిన్ తెండూల్కర్ , యోగా గురు బాబారాందేవ్, కేంద్రమాజీ మంత్రి శశిథరూర్, సినీనటులు కమల్ హాసన్, సల్మన్ ఖాన్, నటి ప్రియాంకచోప్రా, పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, ప్రముఖ టివీ సీరియల్ `తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ బృంద సభ్యులున్నారు.
క్లీన్ పేరిట ఫోటో షూట్
క్లీన్ ఇండియాను సృష్టించడమే మనందరిధ్యేయమని ఉత్సాహపరిచినా అదిచివరకు కేవలం ఫోటోలు దిగడానికిమాత్రమే పనికొచ్చిందన్న విమర్శలొచ్చాయి. స్వచ్ఛ్ భారత్ పథకం క్రింద దేశం మొత్తంమీద 80లక్షల టాయిలెట్స్ నిర్మించాలనుకున్నారు. అయితే అలా నిర్మించిన టాయిలెట్స్ లో నీటిసౌకర్యంలేకపోవడంతో అవి నిరుపయోగంగానే పడి ఉన్నాయి. ప్రధాని ఎంతో ప్రేమతో ప్రారంభించిన ఈపథకం చివరకు నీరుగారిపోతోంది. దీనికితోడు ఇప్పుడు నిర్వహణబాధ్యతలు చేపట్టిన బ్యూరోక్రాట్స్ లో కూడా నిరుత్సాహం అలుముకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణ ఐఏఎస్ అధికారిణి విజయలక్ష్మి జోషి స్వచ్ఛందంగా పదవీవిరమణ చేయాలనుకోవడం. వ్యక్తిగత కారణాలవల్లనే తాను వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాని ఆమె చెబుతున్నా స్వచ్ఛ్ భారత్ పట్ల అసంతృప్తి కూడా కారణమేనని తెలుస్తోంది. అయితే ఇదంతా తప్పేననీ, అసలు విషయమేమంటే, ఆమె భర్త రిటైర్ అయిన తర్వాత ఒకవిదేశీ ఎన్ జీవోలో జాయిన్ అవడంతో తన భర్తతో కలిసిఉండాలన్న కారణంగానే ఆమె వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నారని అధికారవర్గాలు బల్లగుద్దిమరీ చెబుతున్నాయి. అందుకే మంత్రి బీరేందర్ సింగ్ ఈమె రాజీనామా పత్రాన్ని క్యాబినెట్ సెక్రటరేట్ కి పంపించారని అంటున్నారు.
ఇంకో ఆసక్తికరమైన విషయమేమంటే, గతవారమే మరో సీనియర్ అధికారికూడా పర్సనల్ రీజన్స్ కారణంగానే పక్కకు తప్పుకోవడం. హోం కార్యదర్శిగా ఉన్న ఎల్.సి గోయల్ రాజీనామా చేయడంతో ఆ స్థానంలో రాజీవ్ మెహర్షిని అప్పటికప్పుడు హడావుడిగా నియమించడంపై కూడా గుసగుసలు వినబడుతున్నాయి.
బ్యూరోక్రసీ `క్లీన్’ పథకం
స్వచ్ఛ్ భారత్ తో దేశాన్ని క్లీన్ చేయడమన్నమాట ఎలాఉన్నప్పటికీ మోదీ బ్యూరోక్రససీని క్లీన్ చేసేపనిలో పడ్డట్టున్నారనీ, తనకు ఇష్టంలేని అధికారులను తొలగించేపనిలో ఉన్నారని ఆమ్ ఆద్మి పార్టీ (ఆప్) నాయకుడు అషుతోష్ విమర్శించారు. కేవలం కొద్దిరోజుల వ్యవధిలోఇద్దరు స్వచ్ఛ్ భారత్ అధికారులు వ్యక్తిగతకారణాలుచెబుతూ రాజీనామాచేయడం వెనుక ప్రత్యేక వ్యూహరచన కనబడుతోందని ఆప్ నాయకుడు ఆక్షేపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే స్వచ్ఛ్ భారత్ మిషన్ ద్వారా ఇండియాను క్లీన్ చేయడంమాటఎలాఉన్నప్పటికీ, ఇష్టంలేని బ్యూరోక్రాట్స్ ని తొలగించే పనిమాత్రం చురుగ్గాఉన్నట్టు కనబడుతోందని అషుతోష్ విమర్శిస్తున్నారు.
స్వచ్ఛ్ భారత్ పేరిట ప్రారంభహడావుడి ముగిశాక ఇప్పుడు ఆ సందడిలేదు. ఏడాదిగడవకముందే ఓమంచి పథకం చప్పబడిపోయినట్టే. మొదట్లో అంతా హడావుడే… ఊరూవాడా క్లీన్ చేసేస్తున్నట్టు ఫోజులిచ్చి ఫోటోలు తీయించుకున్నారు. అయితే నెలలుగడిచేసరికి, ఇప్పుడు సెలబ్రెటీస్ కూడా పెద్దగా పట్టించుకున్నట్టు కనబడటంలేదు. మోదీకి కూడా తన మానసపుత్రిక (స్వచ్ఛ్ భారత్)ను పట్టించుకునే తీరిక లేకుండాపోయింది. బీహార్ ఎన్నికలపట్ల ఉన్న శ్రద్ధ ఈ పథకంపై కనబడటంలేదు. కేవలం ప్రచారానికిమాత్రమే పథకం ఏర్పాటుచేసినట్టు అనిపిస్తోంది. ఏరుదాటాక తెప్పతగలేసినట్టే అయింది. ఏదో ఒక్కరోజు వీధిలో చెత్తాచెదారం తీసేసి ఫోటోలు, వీడియోలు తీయించుకుని సోషల్ మీడియాలో పెట్టేసి చేతులుదులుపుకునేవారే అధిక సంఖ్యలోఉన్నారు. ప్రజల్లో చైతన్యం కలిగించాల్సినవారే చేతులుదులుపుకోవడంతో ఈ పథకం ఆశయం నీరుగారిపోయిందనే చెప్పాలి. అక్టోబర్ 2 దగ్గరకు వస్తున్న ప్రస్తుత సమయంలో మళ్ళీ నిద్రలేచి హడావుడి చేస్తారా, లేక అదికూడా మరచిపోయి నిద్రలోకి జారుకుంటారా అన్నది వేచిచూడాలి.
– కణ్వస