విశాఖ శారదాపీఠం ప్రైవేటు పీఠం. దానికి ప్రభుత్వ గుర్తింపు లేదు. దేవాదాయశాఖ గుర్తింపు కూడా లేదు. ప్రభుత్వ గుర్తింపు కావాలంటే.. చాలా షరతులు అంగీకరించాలి. అందుకే ఆ పీఠం ప్రైవేటుగానే ఉండిపోయింది. కానీ రాజకీయంగా చాలా గుర్తింపు ఉంది.. ఆ పీఠం స్వాములోరు స్వరూపానందకు. దేవాదాయశాఖ ఆయన గుప్పిట్లోనే ఉందని చెబుతూంటారు. అది నిజమనించేలాలా దేవాదాయశాఖలో మరో నిర్ణయం తీసుకున్నారు. వారసుడు వస్తే దేవాదాయ మంత్రి వచ్చిన దానికంటే ఎక్కువ మర్యాదలు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
శారదాపీఠానికి వారసుడిగా స్వాత్మానందేంద్రను గతంలో స్వరూపానంద ప్రకటించారు. ఈయన స్వరూపానంద మేనల్లుడేనని చెబుతారు. ఆయనకు కూడా స్వామీజిగా గుర్తింపు తెచ్చి పెట్టడానికి స్వరూపానంద తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. ఈ క్రమంలో స్వాత్మానందేంద్రతో స్వధర్మ వాహిని పేరుతో ప్రచార యాత్ర చేపట్టాలనిపురమాయించారు. దీనికి ఖర్చు ఎవరిది అంటే.. ఇంకెవరిది జనాలదని దేవాదాయశాఖ ముందుకొచ్చింది. ప్రచార యాత్రకు ఉప కమిషనరును నోడల్ అధికారిగా నియమించేశారు.
దేవాదాయశాఖలో రిజిస్టరైన మఠాలు, పీఠాలకు చెందిన స్వాములు యాత్రగా వస్తే అధికారికంగా పూర్ణకుంభంతో స్వాగతం చెబుతారు. అంతకు మించి జోక్యం ఉండదు. కానీ స్వరూపానంద వారసుడికి మాత్రం ఆలయాలను సందర్శించిన సమయంలో పీఠార్చన నిర్వహించాలని, తగిన మర్యాదలు పాటించాలని అధికారికంగా ఆదేశాలిచ్చారు. ఇది ఇతర స్వామిజీలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. శారదాపీఠం విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఎన్నో నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. గతంలో శారదాపీఠంలో జరిగే ఉత్సవాలకు అన్ని ఆలాయల నుంచి డబ్బులు ఇవ్వాలని ఉత్తర్వులు కూడా ఇచ్చారు. పలు చోట్ల భూములు కేటాయించాయి. ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలెన్నో తీసుకున్నారు.