swag Movie Review
తెలుగు360 రేటింగ్: 1.75/5
”ఈ యేడాది మీరు చూసిన సినిమాల్లో ది బెస్ట్ ఇంట్రవెల్, ది బెస్ట్ క్లైమాక్స్… ది బెస్ట్ మూవీ ఇదే”అని దర్శకుడు…”ఈ సినిమా రషెష్ చూశాక… నేనేం జోక్యం చేసుకోను. ఎంతకావాలంటే అంత అడగండి.. నేను డబ్బులు పంపిస్తా అని నిర్మాత ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడు..” అని హీరో..బల్లలు గుద్ది మరీ చెప్పాక… ‘మరీ అంత తీసిపాడేసే సినిమా ఏం కాదేమోలే’ అనే నమ్మకంతో, ఒకానొక ధైర్యంతో, ఇంకాస్త చెప్పాలంటే మొండితనంతో `శ్వాగ్` థియేటర్లలో అడుగుపెడతాడు సామాన్య, సగటు ప్రేక్షకుడు.
‘సామజవరగమన’, ‘ఓం భీం బుష్’ లాంటి కామెడీ సినిమాల తరవాత… ఆ మాత్రం వినోదం మళ్లీ తప్పకుండా అందిస్తాడన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ‘శ్వాగ్’ సినిమాకు వరం.
అయితే.. ఆ బద్దలైన బల్లలు, తెగిన టికెట్లకు న్యాయం జరిగిందా? ఈ శ్వాగణిక వంశం కథేమిటి? ‘కింగ్ ఆఫ్ కంటెంట్’ అంటూ కొత్త నామకరణం చేసుకొన్న శ్రీవిష్ణు ఈసారి ఎలాంటి కంటెంట్‌తో వచ్చాడు?
నిజంగా కథలోకి వెళ్లి, కథే చెప్పాలనుకొంటే.. అది కాస్త తికమక తాండ్రగా ఉంటుంది. ఆ ఫజిల్ ఎంత బుర్ర గొక్కున్నా అర్థం కాదు. కాబట్టి సింపుల్ గా ఒక్క ముక్కలో తేల్చేస్తే … అనగనగా శ్వాగణిక వంశానికి వారసత్వ సంపద. ఈతరంలో ఆ సంపద క్లెయిమ్ చేసుకోవడానికి ఓ వారసుడు కావాలి. ఆ వారసుడి కోసం ఓ కుటుంబం అన్వేషిస్తుంటుంది. ‘ఆ వారసుడివి నువ్వే… ఆ సంపద వెళ్లి తెచ్చుకో’ అంటూ కొంతమందికి ఉత్తరాలు అందుతాయి. భవభూతి (శ్రీవిష్ణు), లింగ (శ్రీవిష్ణు) అను (రీతూ వర్మ) ఈ సంపదకు అసలైన వారసులమని రంగంలోకి దిగుతారు. నిజానికి ఈ వాసత్వ సంపద ఎవరిది? ఈ ముగ్గురు కాకుండా మరెవరైనా ఉన్నారా? అసలు శ్వాగణిక వంశం కథేమిటి? చివరికి ఈ నిధి ఎవరికి చిక్కింది? అనేది ‘శ్వాగ్’ సినిమా.
కథలోనే చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. వాటికి ఇంకాస్త కన్ఫ్యూజన్తో నింపేశాడు దర్శకుడు. కొత్తగా ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నప్పుడు గైడెన్స్ కోసం ఓ బుక్ లెట్ ఇస్తుంటారు. అలాంటిది ఈ సినిమా టికెట్ తో పాటు ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఆ వంశాలేమిటో? వంశ వృక్షాలేమిటో? ఎవరికి ఎవరు ఏమవుతారో తెలుసుకోవడానికి మినిమం డిగ్రీ, పీజీ, ఐఏఎస్, ఐపీఎస్ చదివి ఉండాలి. తెలిసిన కథని కొత్తగా చెప్పాలి, కొత్త కథని తెలిసేలా చెప్పాలి అనేది స్క్రీన్ ప్లేలో ప్రాధమిక పాఠం. దాన్ని దర్శకుడు బొత్తిగా పట్టించుకోలేదు. రకరకాల పాత్రలు, రకరకాల క్యారెక్టరైజేషన్లు, వాటి మధ్య వారసత్వ సంపద… ఇలా కథని వీలైనంత కంగాళీ చేశాడు. నిజానికి ‘శ్వాగ్’ అనే టైటిల్, ఆ ప్రచార చిత్రాలు, అందులో కనిపించిన ఒకట్రెండు జోకులు చూసి, ఇది కామెడీ సినిమా ఏమో అని భ్రమించి థియేటర్లో అడుగు పెడతాడు ప్రేక్షకుడు. అయితే ఆ కామెడీ ఇసుమంత కూడా కనిపించదు. గెటప్పులు కామెడీగా ఉన్నా… ఎక్కడా వినోదం పుట్టలేదు. నిజానికి భవభూతి పాత్ర నుంచి వినోదం పుట్టించే స్కోప్ ఉంది. ‘ఇంద్రుడు చంద్రుడు’లో ముసలి కమల్ హాసన్ ని ఇమిటేట్ చేయడానికి శ్రీవిష్ణు తాపత్రయ పడ్డాడే తప్ప, ఆ పాత్రలోంచి వినోదం పుట్టించే మార్గం గురించి ఆలోచించలేదు. లింగ పాత్ర కూడా అంతే. యూత్ కి కనెక్ట్ చేయగలిగే పాత్ర అది. దాన్నీ అస్సలు వాడుకోలేదు.
ఓ కథలో లీనం అవ్వాలంటే ఏదో ఓ పాత్రతో కనెక్ట్ అవ్వాలి. ఆ కనక్షన్ ఈ సినిమాకు లేదు. లింగ, భవభూతి, అను.. వీటిలో ఏ పాత్ర వైపు నుంచి కథని ఫాలో అవ్వాలో ఎవ్వరికీ అర్థం కాదు. ఇంట్రవెల్ లో మైండ్ పోయే ట్విస్ట్ ఉంది అనుకొన్నవాళ్లకు అక్కడే భంగపాటే ఎదురవుతుంది. అప్పటి వరకూ మనకు తెలిసిన పాత్రల్నీ ఒకే ఫ్రేమ్ లోకి తీసుకొచ్చి, మనకు తెలియని కొత్త పాత్రని పరిచయం చేసి తనపై ఇంకొంచెం ఎక్ట్సా భారం వేశాడు దర్శకుడు.
మాతృస్వామ్యం, పితృస్వామ్యం అంటూ మొదలెట్టి, చివరకు ట్రాన్స్ జెండర్ పాయింట్ దగ్గర ఆగాడు దర్శకుడు. ఇది చాలా సెన్సిటీవ్ సబ్జెక్ట్. దాన్ని చాలా సెటిల్డ్ గా డీల్ చేయాలి. ఆ ప్రయత్నం కొంత వరకూ చేశాడు కూడా. కానీ.. ‘శ్వాగ్’ నుంచి ప్రేక్షకుడు ఆశించింది మాత్రం ఇది కాదు. ఇదో నిధి కథ అని, కామెడీ సెటప్ తో టైమ్ పాస్ చేస్తాడని ప్రేక్షకుడు భావిస్తాడు. అయితే.. ఈ సినిమా నుంచి ఏ కొశాన అది దొరకదు. సెకండాఫ్ మరీ భారంగా నడుస్తుంది. ట్రాన్స్ జెండర్ కథ మరీ సుదీర్ఘంగా సాగింది. క్లైమాక్స్ లోనూ హార్ట్ టచింగ్ మూమెంట్స్ లేవు. దీన్ని వీలైనంత సరదాగా చెప్పి, ఓ ట్రజర్ హంట్ కథకు ఇచ్చే ముగింపు ఇస్తే కచ్చితంగా బాగుండేది. అలా కాకుండా ఎటెటో తీసుకెళ్లిపోయాడు దర్శకుడు.
ఈసారి శ్రీవిష్ణు టైటిల్ మారింది. తనకో కొత్త బిరుదు వచ్చింది. కింగ్ ఆఫ్ కంటెంట్ అని. మంచి కథల్ని ఎంచుకోవడం శ్రీవిష్ణు స్పెషాలిటీ. అయితే శ్రీవిష్ణు ఈసారి కథ ఎంచుకోవడంలో ఈసారి తడబడ్డాడు. బహుశా గెటప్పులు ఎక్కువగా కనిపించాయని ఈ కథకు ఓటేసి ఉంటాడు. ఒకటా రెండా? లెక్కకు మించిన అవతారాలెత్తాడు ఈ సినిమా కోసం. వాటిలో తన నటన బాగుంది. ఏ పాత్రకా పాత్ర… వైవిధ్యం చూపించాడు. ట్రాన్స్ జెండర్ పాత్ర ఓ సవాల్. ‘ఒకే సినిమాలో ఇన్ని పాత్రలేశాను’ అని చెప్పుకోవడానికి `శ్వాగ్` ఉపయోగపడుతుంది. అంతే. రీతూ వర్మ పాత్రని చాలా బాగా మొదలెట్టి, చివరికి చప్పగా తేల్చేశారు. ఆ పాత్ర ఆర్క్ కూడా ఆశించినంతగా కుదర్లేదు. మీరా జాస్మిన్ చాలా కాలం తరవాత కనిపించింది. ఆమె పాత్ర ఓకే అనిపిస్తుంది. రవిబాబు గెటప్ మారింది కానీ, తన టైమింగ్ లో మార్పు రాలేదు. గెటప్ శీను ఉన్నా.. లేనట్టే. సునీల్ కూడా గుర్తుండిపోయేలా ఏం చేయలేకపోయాడు.
అసలు ఈ కథని ఏ లక్ష్యంతో మొదలెట్టాడో తెలీదు కానీ, దర్శకుడు ఆ లక్ష్యానికి చాలా దూరంలో అయితే నిలబడిపోయాడు. వంశాలు, చరిత్ర, మాతృ స్వామ్యం అంటూ పెద్ద పెద్ద సెటప్పులతో సినిమా మొదలెట్టి, చివరికి ఎటో తీసుకెళ్లాడు. పాత్రలు అర్థం అవ్వడంలో చాలా గందరగోళం ఉంది. అది స్క్రీన్ ప్లేలో లోపం. కొన్ని మాటలు అక్కడక్కడ బాగున్నాయి. శ్రీవిష్ణు సినిమా నుంచి ఆశించే వినోదం ఈ సినిమా నుంచి దక్కలేదు. వివేక్ సాగర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కొన్ని బీజియమ్స్ బాగున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్ట్ కాబట్టి క్వాలిటీ విషయంలో పేరు పెట్టాల్సిన పనిలేదు. అయితే.. కథ, కథనం విషయంలోనే జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అదే చేసి ఉంటే.. మంచి టైటిల్, శ్రీవిష్ణు వేసిన గెటప్పులు… ఇవన్నీ వృథా అయ్యేవి కావు.
తెలుగు360 రేటింగ్: 1.75/5