నిత్యానంద స్వామి కైలాస దేశం ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ రంజితతో కలిసి పరిపాలన కూడా ప్రారంభించాడు. సొంత దేశం.. సొంత కరెన్సీ కూడా ఉన్నాయంటున్నాడు. తాజాగా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కూడా ఉందంటున్నాడు. కానీ.. సీక్రెట్ గా ఉంచాడు. ఆస్ట్రేలియాకు వస్తే అక్కడ్నుంచి సొంత ఫ్లైట్లలో ఫ్రీగా కైలాసం తీసుకెళ్తాననిప్రకటన ఇచ్చేస్తున్నాడు. పర్యాటకుల కోసం వీసాలు ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఇందుకోసం ఈ-మెయిల్స్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాడు.సొంత ఖర్చులతో ఆస్ట్రేలియాలో దిగాలి. అక్కడి నుంచి ఛార్టర్డ్ ఫ్లైట్లు అందుబాటులో ఉంటాయి. వాటిని బుక్ చేసుకుంటే కైలాసలోకి ఎంట్రీ ఉంటుంది.
ఎవ్వరైనా మూడు రోజులకు మించి కైలాసంలో ఉండడం కుదరదని చెబుతున్నాడు. ఈ మూడు రోజుల్లో ఓరోజు నేరుగా ఆ పరమేశ్వుడితో పాటు, తనను దర్శించుకునే అవకాశం కల్పిస్తాడట. హిందువులందరూ రావాలని పిలుపునిస్తున్నారు. సర్వజ్ఞపీఠమ్ పేరుతో నిత్యానంద ఆశ్రమాలు నిర్వహిస్తున్నారు. నిత్యానంద లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో 2010లో అతడిపై రేప్ కేసు నమోదైంది. 53 రోజుల పాటు జైలుకు వెళ్లొచ్చాడు. . వివాదాలు వచ్చినప్పుడు కొద్ది రోజులు ఆజ్ఞాతంలోకి వెళ్లడం మళ్లీ కొత్త వేషధారణతో భక్తుల ముందు ప్రత్యక్షం కావడం చేస్తూంటాడు.
విరాళాల కోసం ఏకంగా భక్తుల పిల్లలను కిడ్నాప్ చేశారంటూ కూడా నిత్యానందపై ఆరోపణలు వచ్చాయి. బాధితుల ఫిర్యాదుపై గుజరాత్ పోలీసులు రంగంలోకి దిగారు. అతడి శిష్యులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అతడి చుట్టు ఉచ్చు బిగుస్తున్న సమయంలో దేశం విడిచిపారిపోయాడు. ఎక్కడున్నాడో తెలియదు కానీ కైలాస.. రివైవింగ్ ద ఎన్లైటెన్డ్ సివిలైజేషన్.. ద గ్రేట్ హిందూ నేషన్.. పేరుతో దేశం ఏర్పాటు చేసుకున్నాడు. తన దేశాన్ని గుర్తించాలంటూ ఐక్యరాజ్య సమితికి నిత్యానంద లేఖ కూడా రాశాడు. అధికారిక వెబ్ సైట్ ఏర్పాటు చేశాడు. అంతా బాగానే ఉంది కానీ.. ఆయన కోసం వెదుకుతున్న ఇండియా పోలీసులు మారు పేరుతో కైలాసానికి పాస్‌పోర్టు తీసుకుంటే.. ఒక్క రోజు ఆయన కల్పించే దర్శనం చాలు కదా.. మొత్తం కథ ముగిసిపోవడానికి అన్న సెటైర్లు సోషల్ మీడియాలో పడుతున్నాయి. అన్నీ తెలిసిన నిత్యానందకు ఈ విషయం మాత్రం తెలియదా.. ఆయన జాగ్రత్తలో ఆయనుంటారని భక్తులు తేలిగ్గా తీసుకుంటున్నారు.