పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. హైదరాబాద్ లో గృహ నిర్బంధంలో ఉన్న ఆయన్ని, పోలీసులు అదుపులోకి తీసుకుని నగరం నుంచి తరలించారు. అయితే, ఆయన స్వస్థలమైన కాకినాడకు తరలించారా, లేదా వేరే ప్రాంతానికి పంపించారా అనే అంశాన్ని పోలీసులు రహస్యంగానే ఉంచారు. నగర బహిష్కరణకు సంబంధించిన నోటీసులను ముందుగా ఇచ్చిన పోలీసులు, ఈ తెల్లవారుజామునే ఆయన్ని నగరం దాటించారు. వ్యూహాత్మకంగా వాహనాలను రెండు మార్గాల ద్వారా పంపడం ద్వారా, ఆయన్ని ఎక్కడికి తరలించారనేది తెలియకుందా చేశారు. గత ఏడాది నవంబర్ లో పరిపూర్ణానంద చేసిన ఓ ప్రసంగం అభ్యంతరకరంగా ఉందనీ, వాటిపై వచ్చిన ఫిర్యాదులకు స్పందించి నగర బహిష్కరణ విధించినట్టు పోలీసులు చెప్తున్నారు.
అయితే, తాజాగా శ్రీరాముడిపై కత్తి మహేష్ అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేయడంతో పరిపూర్ణానంద స్పందించారు. యాదాద్రి నుంచి ధర్మాగ్రహ యాత్ర చేస్తానంటూ సిద్ధమయ్యారు. ఈ యాత్రకు అనుమతులు లేవంటూ పోలీసులు ఆయన్ని గృహనిర్బంధం చేశారు. మూడు రోజులుగా ఆయన హౌస్ అరెస్ట్ లోనే ఉన్నారు. ఇదే అంశమై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ ను ఇప్పటికే పోలీసులు నగర బహిష్కరణ చేసి, ఆయన్ని చిత్తూరు జిల్లాలోని స్వగ్రామానికి రెండ్రోజుల కిందటే పంపించేశారు. కానీ, పరిపూర్ణానంద మాత్రం పట్టు వీడకుండా.. తాను యాత్ర చేస్తాననే పట్టుదలతోనే కూర్చున్నారు. ఇంకోపక్క, ఆయనకి మద్దతుగా చాలామంది సిద్ధమౌతూ ఉండటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. అందుకే నగర బహిష్కరణ చేశామంటున్నారు.
నిజానికి, ఈ వివాదాన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణలో భాజపా కొన్ని కార్యక్రమాలు ప్లాన్ చేసుకుందనే గుసగుసలూ వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఇలా స్పందించిందని అంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే… పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేసింది కత్తి మహేష్ వివాదం నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులపై కాదు! ఎప్పుడో, గత నవంబర్ లో ఏదో ప్రసంగం చేశారనీ, వాటిపై ఫిర్యాదులు ఉంటే ఇప్పుడు స్పందించారు. అంతేగానీ, తాజాగా ఆయన తలపెట్టిన ధర్మాగ్రహ యాత్రను కారణంగా పోలీసులు చెప్పకపోవడం గమనార్హం! పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేయడం వల్ల ఆయనకి మద్దతు పెరిగే అవకాశమే కనిపిస్తోంది. ఈ విషయంలో తెలంగాణ సర్కారు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే అనిపిస్తోంది.