….. గంగ చంద్రముఖిగా మారింది అన్నట్టు అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం కార్యాచరణ ప్రకటించడం ద్వారా స్వామి పరిపూర్ణానంద తన రాజకీయ సంకల్పాన్ని వెల్లడించుకున్నారు. రాముడు భక్తి వంటి మాటలు ఎన్ని చెప్పినా అయోధ్య సమస్యకూ బిజెపి ఆరెస్సెస్ రాజకీయాలకూ అవినాభావ సంబంధం అందరికీ తెలిసిందే. పైగా కొందరు ఎన్ఆర్ఐల కోరిక మేరకు ఈ కార్యక్రమం తలపెట్టానంటున్నారు. విదేశాల్లోని రామభక్తులు దేశంలోని స్వామివారిని నడిపించడం విశేషమే. అయితే కోర్టు వెలుపల పరిష్కారానికి ఒప్పుకోమన్నది స్వామి కొత్త మెలిక. కోర్టులోనే పరిష్కారం కోసం రామనామ జపం తలపెట్టారట. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు చాలా కాలంగా ఆరెస్సెస్ నేతలు చెబుతున్నవే. మరి హిందూస్వాముల పరంపరలో తాను ముందుండాలని ఆయన కోరుకుంటున్నారేమో తెలియదు. ప్రొఫెసర్ ఐలయ్య రాసిన పుస్తకంపై చర్చసందర్బంలోనూ పరిపూర్ణానంద చాలా ఆవేశానికి లోనవడం హిందూత్వ శిబిరంలోనే కొందరికి నచ్చలేదు. ఆయనకేదో రాజకీయ ఎజెండా వుందని వారూ ఆరోపిస్తున్నారు. యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో ఆయనను పోలుస్తున్నారు కూడా. ఇప్పుడు ఆ యోగి పీఠంలోనే రామనామస్మరణ అంటున్నారు గనక ఎవరి స్పందన ఎలా వుండేది తెలుస్తుంది. ఇది వివాదానికి దారి తీయదా అని అడిగితే ఆయన చాలా ఆగ్రహిస్తున్నారు గాని సంఘ పరివార్‌లో అంతర్గత వివాదం కాకుండా చూసుకోవడం మరింత ముఖ్యం. ఎందుకంటే ఇప్పటికే మరో స్వామి వర్యులు సర్వధర్మ మందిరం నిర్మిస్తామని ప్రతిపాదించారు. అలా రాజీ పడవలసిన అవసరం లేదని చెప్పడానికే పరిపూర్ణుల వారు ఈ కార్యక్రమం తలపెట్టారు. ఫ్రశాంతంగా జరగాలని మాత్రం కోరుకుందాం.