కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి రాజకీయ రంగ ప్రవేశ ప్రవేశం చేశారు. అమిత్ షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ కోసం… బీజేపీ సిద్ధాంతాల కోసం … మనసా, వాచా పని చేస్తానని ప్రకటించారు. అయితే పరిపూర్ణానంద ఏ రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తారనేది బహిరంగంగా ప్రకటించకపోయినా.. తెలంగామనే టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. శనివారం.. తెలంగాణ నేతలతో… బీజేపీ పార్లమెంట్ బోర్డు సమావేశం కాబోతోంది. ఆయన సమావేశానికి పరిపూర్ణానంద కూడా హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరిపూర్ణానంద సేవలను విస్తృతంగా వాడుకోవాలని అమిత్ షా నిర్ణయించుకున్నారు. ఆయనను ఓ అసెంబ్లీ స్థానం నుంచి అభ్యర్థిగా ప్రకటిస్తారని కూడా చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ లేని విధంగా.. ఇటీవలి కాలంలో కొంత మంది స్వామిజీలు పాపులర్ అయిపోయారు. గతంలో చినజీయర్ లాంటి ఒకరిద్దరు మాత్రమే… ప్రజలకు తెలుసు. వారు కూడా.. కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనే పాల్గొనేవారు. రాజకీయాలు మాట్లాడటం పరమపాపం అన్నట్లు ఉండేవారు. కానీ ఈ పరిస్థితి గత నాలుగేళ్లలో పూర్తిగా మారిపోయింది. కొంత మంది స్వాములు ఇప్పుడు రాజకీయాలు మాత్రమే మాట్లాడుతున్నారు. విశాఖ శారదాపీఠం పేరుతో.. స్వరూపానందేంద్ర స్వామి చేసే రాజకీయ ప్రకటనలు అన్నీ ఇన్నీ కావు. ఆయన ఇప్పుడు వైసీపీ అధినేత జగన్‌కు ఓ రకంగా ఆస్థాన స్వామిజీగా ఉన్నారు. శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి ఇటీవలి కాలంలో హిందూ బేస్‌గా రాజకీయాలు ప్రారంభించారు. ప్రత్యేకంగా ఓ చానల్ పెట్టి హిందూత్వ పరిరక్షణ అంటూ ఉద్యమాలు ప్రారంభించారు. ఏ చిన్న అవకాశం వచ్చినా ఆయన వదిలి పెట్టడం లేదు.
పరిపూర్ణానంద కొంతకాలం తెలంగాణలోనే సభలు పెడుతున్నారు. గతంలో మహబాబూనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో సభలు పెట్టారు. ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న చోట్ల ఆ సభలు పెట్టారు. విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కత్తి మహేష్ వివాదంలో.. ఆ వ్యాఖ్యలను కారణంగా చూపించే.. పోలీసులు హైదరాబాద్ నగర బహిష్కరణ చేశారు. ఇప్పుడు నేరుగా రాజకీయాల్లోకి వచ్చేశారు కాబట్టి… బీజేపీ తరపున హిందుత్వ మార్క్ రాజకీయాలు తెలంగాణలో మరింత జోరుగా ప్రారంభమవుతాయని అనుకోవచ్చు.