ఆర్.బి.ఐ.గవర్నర్ రఘురామ రాజన్ పై భాజపా రాజ్యాసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఈరోజు మళ్ళీ ఆరోపణలు చేశారు. ఆయన డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “ఆయన (రఘురామ రాజన్) భారత ఆర్ధిక వ్యవస్థకి అమర్చిన టైం బాంబు వంటివాడు. ఆ బాంబు డిశంబర్ 2016లో ప్రేలే విధంగా సెట్ చేయబడింది. ఆ నెలలో మన బ్యాంకులు సుమారు $24 బిలియన్లు చెల్లించుకోవలసిన ప్రమాదం కనిపిస్తోంది,” అని ఆరోపించారు.
ఆయన ఆవిధంగా ఎందుకు ఆరోపిస్తున్నారో తెలియదు. ఆర్.బి.ఐ.గవర్నర్ రఘురామ రాజన్ వలన దేశ ఆర్ధిక వ్యవస్థకి చాలా ప్రమాదం ముంచుకు వస్తోందని పదేపదే హెచ్చరిస్తున్నారు. ఒకవేళ స్వామి చేస్తున్న ఆరోపణలు నిజమనుకొంటే అది చాలా ఆందోళన కలిగించే విషయమే. స్వంత పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడే ఆయనపై అంత తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నా కూడా భాజపా అధిష్టానం కానీ ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ గానీ ఆయనని వారించడం లేదు. కనీసం స్పందించడం లేదు. స్వామి ఆవిధంగా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నట్లు లేదు. ఇటువంటి అవకాశం వస్తే వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టపడని కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు కూడా ఈ వ్యవహారంలో కలుగజేసుకోకపోవడం, అవి కూడా మౌనం వహిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. రాజన్ పనితీరు పట్ల ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్న కారణంగానే స్వామి చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదా అంటే ప్రభుత్వమే ఆయన పదవీ కాలం పొడిగించాలని భావిస్తోంది. అందుకు ఆయనే సిద్దంగా లేరని సమాచారం. ఒకవేళ ఆయనపై ఏవిషయంలోనైనా మోడీ ప్రభుత్వానికి అభ్యంతరాలు, సమస్యలు ఉన్నట్లయితే, ఆయనని పిలిపించుకొని మాట్లాడవచ్చు కానీ ఈవిధంగా ఆయనకి సుబ్రహ్మణ్యస్వామి ద్వారా పరోక్షంగా హెచ్చరికలు చేయనవసరం లేదు. ఆయనపై సుబ్రహ్మణ్య స్వామి చేస్తున్న ఆరోపణల వలన మోడీ ప్రభుత్వానికే అప్రదిష్ట కలుగుతుంది తప్ప ఇతరులకి కాదు. అయినా ఈ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలియదు. ఏదో ఒకరోజు రఘురామ రాజన్ ఆ తెర వెనుక జరిగిన కధని స్వయంగా బయటపెడతారేమో..చూడాలి.