భారతీయ విలువలకు స్వామి వివేకానంద ప్రతినిధి అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభివర్ణించారు. వివేకానందుడు భారతీయ ఆత్మ అని పేర్కొన్నారు. ఆయన బోధనలు అందరికీ ఆదర్శనీయమన్నారు. వివేకానందుడి జీవితం ఒక స్ఫూర్తి అన్నారు మోడీ.
మలేషియా రాజధాని కౌలాలంపూర్లోని రామకృష్ణ మిషన్ కాంప్లెక్స్ లో స్వామి వివేకానంద విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సమున్నతమైన భారతీయ విలువల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన స్వామి బోధనలు చిరసర్మరణీయమని తెలిపారు. వేదాల నుంచి వివేకానందుడి దాకా, భారతీయ సంస్కృతి మహోన్నమైందని మోడీ చెప్పారు.
విగ్రహావిష్కరణ సందర్భంగా రామకృష్ణ మిషన్ నిర్వాహకులు మోడీకి సాదర స్వాగతం పలికారు. కౌలాలంపూర్ సమీపంలోని పెటాలింగ్ జయలో 2011లో ఈ మిషన్ ను స్థాపించారు. అప్పటి నుంచి తాము నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి మోడీకి వివరించారు. ఈ సందర్భంగా మిషన్ సేవా కార్యక్రమాలను మోడీ అభినందించారు.