హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల రెండు-మూడుసార్లు చంద్రబాబునాయుడు ప్రభుత్వం కూలిపోబోతోందని, తాను ముఖ్యమంత్రి కాబోతున్నానని చెబుతున్న సంగతి తెలిసిందే. స్వతహాగా క్రైస్తవుడైన జగన్ ఇలా జోతిష్కాలు నమ్మటమేమిటా అని అందరూ చర్చించుకున్నారుకూడా. అయితే దానికి కారణం హిందూత్వంపట్ల జగన్ ఆసక్తి కాదని, ఒక సుప్రసిద్ధ స్వామీజీ అని ఇప్పుడు తేలింది. ఆ స్వామీజీ మరెవరో కాదు. ప్రకాశంజిల్లాలో వేంచేసిఉన్న రామదూత స్వామి. ఈయన ఇటీవల హై ప్రొఫైల్ స్వామీజీగా మారిపోయిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ ఎంపీ మురళీ మనోహర్ జోషి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, కేంద్ర మాజీ మంత్రి మునియప్ప, గాలి జనార్దనరెడ్డి, తెలుగు రాష్ట్రాలకు చెందిన టి.సుబ్బరామిరెడ్డి, గీతారెడ్డి, మాడీ డీజీపీ దినేష్ రెడ్డి, డీఎస్, జయప్రద, అమర్ సింగ్, బ్రహ్మానందం, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనర్సింహ తదితర ప్రముఖులు రామదూత స్వామి భక్తులే. వీరందరూ స్వామీజీని దర్శించుకుని పాదాభివందనాలు చేసినవారే. వీరందరితో స్వామీజీ దాంపత్యయాగాలు చేయిస్తుంటారు. ఈ స్వామీజీ జగన్కు త్వరలో ముఖ్యమంత్రి అవుతావని చెప్పారట. అప్పటినుంచి జగన్ రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తూ, త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నట్లు మీడియాకుకూడా చెబుతున్నారు.
కొసమెరుపేమిటంటే చంద్రబాబునాయుడుకూడా ఈ స్వామీజీని హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో కలుసుకుని ఆశీస్సులు తీసుకున్నారు. గత ఏడాది జులైలో, ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఈ కార్యక్రమం జరిగింది. తమ పార్టీకి చెందిన కేంద్రమంత్రి సుజనా చౌదరితో కలిసి బాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్వామీజీ బాబుతో ప్రత్యేక పూజలుకూడా చేయించారు. రామదూత స్వామిమీద భూకబ్జా ఆరోపణలు చాలా ఉన్నాయి.