అయోధ్యలో రామ మందిరం నిర్మించేందుకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీం కోర్టులో నిన్న ఒక పిటిషన్ వేశారు. దీని కోసం దాఖలయిన అనేక ఇతర పిటిషన్లపై కూడా వీలయినంత త్వరగా విచారణ చేపట్టి తీర్పు చెప్పవలసిందిగా తన పిటిషన్ లో స్వామి కోరారు. “ఇస్లామిక్ మతాచారాల ప్రకారం ఒక మశీదును అవసరమయితే వేరే చోటికి తరలించే వీలుంది కానీ హిందూమతాచారాల ప్రకారం గుళ్ళు గోపురాలు ఎంత శిధిలమయినా అవి వాటి ప్రాధాన్యత కోల్పోవు..వాటిని వేరే చోటికి తరలించడానికి వీలు లేదు. కనుక అయోధ్యలో రామ మందిరం పక్కన ఉన్న మశీదుని అక్కడి నుండి తొలగించి, రామ మందిరం నిర్మించేందుకు ఆదేశాలు జారీ చేయవలసిందిగా కోర్టును కోరుతున్నాను,” అని సుబ్రహ్మణ్య స్వామి తన పిటిషన్ లో పేర్కొన్నారు.
ఆయన వేసిన పిటిషన్ న్ని విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు, దానిని కూడా మిగిలిన కేసులను విచారిస్తున్న సుప్రీం కోర్టు ధర్మాసనానికి అప్పగిస్తున్నట్లు తెలియజేసింది. ఆ పిటిషన్ విచారణకు అర్హత కలిగి ఉన్నట్లు ఆ ధర్మాసనం భావించినట్లయితే దానిని స్వీకరిస్తుందని లేకుంటే తిరస్కరించవచ్చని సుప్రీం కోర్టు తెలియజేసింది. సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ వేసినంత మాత్రాన్న అయోధ్యలో రామ మందిరం నిర్మించేయడం సాధ్యంకాదనే సంగతి అందరికీ తెలుసు. కానీ ఆయన వేసిన పిటిషన్ వలన బీజేపీకి, ముఖ్యంగా మోడీ ప్రభుత్వానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చును.
ఏవిధంగా అంటే, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశంలో మత అసహనం పెరిగిపోయిందని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పనిగట్టుకొని ప్రచారం చేస్తుంటే వాటిని ఏవిధంగా ఎదుర్కోవాలో తెలియక మోడీ ప్రభుత్వం సతమతమవుతోంది. దేశంలో అనేక మంది ప్రముఖులు కూడా మత అసహనంపై మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఆ కారణంగా మోడీ ప్రభువ్తం చాలా అప్రదిష్ట మూటగట్టుకోవలసి వచ్చింది. చివరికి విదేశాలకి కూడా ఈ ప్రచారం పాకిపోవడంతో ప్రపంచ దేశాల ముందు భారత్ తలదించుకొనే పరిస్థితి ఏర్పడుతోంది. నేటి నుండి పార్లమెంటు సమావేశాలు కూడా మొదలవుతున్నాయి. ఇటువంటి సమయంలో బీజేపీకే చెందిన సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీం కోర్టులో రామ మందిరం నిర్మాణం కోసం పిటిషన్ వేయడంతో, ప్రతిపక్షాలు చేస్తున్న మత అసహనం వాదనకి బలం చేకూరినట్లయింది. దానితో ఈ పార్లమెంటు సమావేశాలలో మోడీ ప్రభుత్వంపై బలంగా దాడి చేసేందుకు ప్రతిపక్షాలకు సుబ్రహ్మణ్య స్వామి మరో బలమయిన ఆయుధం అందించినట్లయింది.