తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ..టీఆర్ఎస్లో అసంతృప్తి స్వరం వినిపించడం ప్రారంభించారు. కొన్ని కులాలే పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్నాయని .. అధికారం కొంతమందికే పరిమితమైందని సంచలన ఆరోపణలతో తెరపైకి వచ్చారు. కుల రక్కసి తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తూ…బడుగుబలహీన వర్గాలకు అన్యాయం చేస్తోందని స్వామిగౌడ్ అంటున్నారు. స్వామి గౌడ్‌కు హఠాత్తుగా కులం కోణం..ఎందుకు గుర్తొచ్చిందో.. కానీ.. టీఆర్ఎస్లో ఈయన మాటలు కలకలం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.
ఉద్యోగ సంఘాల నేతగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయనకు కేసీఆర్ … తర్వాత ఎమ్మెల్సీపదవి ఇచ్చి శాసనమండలి చైర్మన్ ను కూడా చేశారు. అయితే ఆ పదవీ కాలం అయిపోయిన తర్వాత ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. పైగా పార్టీలోనూ ఆయన ఎక్కడా కనిపించడం లేదు. ఎమ్మెల్సీ పదవులు.. రాజ్యసభ పదవుల భర్తీ చేయాల్సి వచ్చినప్పుడు ఆయన రేసులో ఉన్నారని చెబుతూ ఉంటారు కానీ.. పదవి దగ్గరకు ఎప్పుడూ రాలేదు.
దాంతో ఆయన రాజకీయాల నుంచి ఫేడవుట్ అయ్యారేమో అన్న చర్చ జరుగుతోంది. అయితే హఠాత్తుగా ఆయన తానున్నానని తెరపైకి వచ్చారు. సాధారణంగా తను బీసీ కాబట్టి.. సామాజికవర్గ పరంగా చూసినా ఎక్కువ అవకాశాలు వస్తాయని ఆయన ఊహించి ఉంటారు.కానీ.. కేసీఆర్ అనుకున్న వారికి మాత్రమే అవకాశాలు వస్తాయి. ప్రస్తుతం సామాజికవర్గానికి ముందుకు తీసుకు వచ్చినా… స్వామిగౌడ్‌కు దక్కేదేమీ ఉండదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.