ఉద్యోగ సంఘాల నేతగా తెలంగాణ ఉద్యమంలో సకలజనుల సమ్మెను ఒంటి చేత్తో నడిపిన స్వామిగౌడ్ టీఆర్ఎస్కు దూరమయ్యారు. ఆయన ఢిల్లీ వెళ్లి జేపీ నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి.. శాసన మండలి చైర్మన్ ను చేశారు. కానీ ఆ పదవీ కాలం పూర్తియిన తర్వతా పట్టించుకోవడం మానేశారు. పట్టించుకోవడం కాదు.. అసలు లెక్కలోకే తీసుకోలేదని ఆయన ఆవేదన చెందుతున్నారు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన బయటకు వచ్చి అదే బాధ వ్యక్తం చేశారు. రెండేళ్ల నుంచి సీఎం కేసీఆర్ను కలిసేందుకు ప్రయత్ని స్తున్నా.. ఇంతవరకు అపాయింట్మెంట్ దొరకలేదని బాధపడ్డారు.
తనకు అక్కడ కనీస గౌరవం కూడా లభించడం లేదు కాబట్టి.. ఆత్మగౌరవం కోసమే బీజేపీలో చేరానని స్ఫష్టం చేశారు. తెలంగాణ కోసం ఒక్క నాడు కూడా పోరాడని వారికి కేసీఆర్ పదవులు ఇచ్చారని.. తెలంగాణ కోసం పోరాడిన వారిని పక్కన పెట్టారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యమకారులు కనీస మర్యాదలకు నోచుకోరా అని ప్రశ్నించారు. నిజానికి చాలా మంది టీఆర్ఎస్ మొదటి తరం నేతలది ఇదే అభిప్రాయం. కేసీఆర్ సీనియర్లకు సైతం అపాయింట్మెంట్లు ఇచ్చి నెలలు దాటిపోతూ ఉంటుంది.
బంగారు తెలంగాణ కోసం పార్టీలో చేరి పదవులు పొందిన వారు హవా చూపిస్తూండగా.. ఉద్యమంలో కేసీఆర్తో పాటు ఉన్న వారు సైడ్ అయిపోయారు. కొంత మందికి పదవులు వచ్చినా.. చివరికి వారు రాజకీయంలో వెనుకబడిపోయారు. అలాంటి వారంతా అవకాశం కోసం చూస్తున్నారు. స్వామిగౌడ్కు ఇప్పుడు అవకాశం వచ్చింది. మెరుగైన ప్రత్యామ్నాయం బీజేపీ రూపంలో కనిపిస్తే.. ఉద్యమకారులంతా క్యూ కట్టడం ఖాయం అనుకోవచ్చు.