ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించడంతో కొంతకాలం మౌనం వహించిన భాజపా ఎంపి సుబ్రహ్మణ్య స్వామి మళ్ళీ నిన్న నోరు విప్పారు. ఈసారి కూడా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ రాజన్ పైనే విమర్శలు చేశారు. ఆయనని విమర్శించినందుకు మీడియాలో ఒక వర్గం పనిగట్టుకొని తనని విలన్ గా చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రఘురామ రాజన్ గురించి చేసిన ఆరోపణలకి నేటికీ తాను కట్టుబడే ఉన్నానని చెప్పారు. ఆయన పదవిలో నుంచి తప్పుకొంటే స్టాక్ మార్కెట్స్ కుప్పకూలిపోతాయనే మీడియా వాదనలో నిజం లేదని, ఆయన వెళ్లిపోతేనే స్టాక్ మార్కెట్లు మళ్ళీ పుంజుకొంటాయని అన్నారు. రాజన్ విధానాలు దేశ ఆర్ధిక వ్యవస్థకి, ముఖ్యంగా చిన్న పరిశ్రమలకి చాలా ఇబ్బందులు, చాలా నష్టం కలిగిస్తున్నాయని అన్నారు. కనుక రఘురామ రాజన్ పదవిలో నుంచి దిగిపోతే గానీ ఈ సమస్యలు కొలిక్కిరావని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు.
గతంలో ఆయన రఘురామ రాజన్ పై తీవ్ర విమర్శలు చేస్తునప్పుడు చాలా కాలం పాటు ఆయనని ప్రధాని నరేంద్ర మోడీ కూడా వారించే ప్రయత్నం చేయకపోవడంతో ప్రజలకి తప్పుడు సంకేతాలు వెళ్ళాయి. ప్రధాని నరేంద్ర మోడీ రాజన్ తీరు పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నందునే సుబ్రహ్మణ్య స్వామిని వారించలేదని ఊహాగానాలు వినిపించాయి. కానీ సుబ్రహ్మణ్య స్వామి చైనా పర్యటనలో ఉన్న ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని, ఆయన బృందాన్ని కూడా విమర్శించిన తరువాతనే ప్రధాని మోడీ అయనని సున్నితంగా హెచ్చరించారు. అప్పటి నుంచే ఆయన నోటికి తాళం వేసుకొని కూర్చొన్నారు. కానీ ఇంతకాలం నోరు మూసుకొని కూర్చోవడం ఆయన చరిత్రలోనే లేదు కనుక అదీ ఒక రికార్డే. చివరికి ఆ రికార్డుని నిన్న బ్రేక్ చేస్తూ మళ్ళీ రఘురామ రాజన్ పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు.
ఒకవేళ రఘురామ రాజన్ వలన దేశ ఆర్ధిక వ్యవస్థకి, తన ప్రభుత్వానికి కూడా నష్టం, అప్రదిష్ట కలుగుతోందని భావిస్తే ప్రధాని నరేంద్ర మోడీ ఆయనని ఎందుకు పదవిలో కొనసాగిస్తారు? అనే ఆలోచన మేధావి-సుబ్రహ్మణ్య స్వామికి కలగకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ వారించిన తరువాత కూడా త్వరలో పదవీ విరమణ చేయనున్న రఘురామ రాజన్ ఆయన ఈవిధంగా విమర్శలు చేయడం చాలా తప్పుడు. ఆయన అనాలోచితంగానో ఏదో దురుదేశ్యంతోనో రఘురామ రాజన్ చేస్తున్న ఇటువ్నటి విమర్శల వలననే స్టాక్ మార్కెట్లు నష్టపోయే అవకాశం ఉంటుంది. కనుక ప్రధాని నరేంద్ర మోడీయే మళ్ళీ ఆయన నోటికి తాళం వేయవలసి ఉంటుంది.