స్వప్నా సురేష్… ఇప్పుడు కేరళలో హాట్ టాపిక్. ఆమె సూపర్ హిట్ సినిమాలో లెటెస్ట్ సెన్సేషన్ హీరోయిన్ కాదు. అంతచందాలతో ఆకట్టుకునే మరో కళాకారిణి కాదు. ప్రజలను రక్షించేందుకు ప్రస్తుత సంక్షోభంలో సర్వం త్యాగం చేసిన వినిత కాదు..! గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్‌ను.. హైలెవల్లో నడుపుతున్న … లేడీ సూపర్ స్మగ్లర్. మామూలుగా అయితే.. ఇలాంటి స్మగ్లర్లు చాలా మంది ఉంటారు.. కానీ ఆమె నేరుగా.. సీఎం పినరయి విజయన్తోనే తనకు సాన్నిహిత్యం ఉందన్నట్లుగా షో చేసుకుంది. దాంతో.. ఆయనకూ చిక్కులు తప్పడం లేదు. సహజంగా.. ఇలాంటి విషయంలో రాజకీయం జోరుగా ఉంటుంది. స్వప్నా సురేష్ అందమైన యువతి కూడా కావడంతో.. ఇది మరింత ఎక్కువగా ఉంది. జాతీయ మీడియా కూడా హైలెట్ చేస్తోంది.
ఈ గోల్డ్ స్మగ్లింగ్ ఆషామాషీగా జరగలేదు. దుబాయ్ నుంచి యూఏఈ దౌత్య కార్యాలయం పేరుతో చార్టర్డ్ విమానంలో తిరువనంతపురం విమానాశ్రయానికి గృహోపకరణాల పేరుతో సరుకు పంపారు. అందులో 30 కిలోల బంగారం ఉంది. దౌత్య కార్యాలయం పేరుతో వచ్చిన సరుకులోనే బంగారం స్మగ్లింగ్ చేయడం కలకలం రేపింది. ఈ కేసులో యూఏఈ కాన్సులేట్ మాజీ ఉద్యోగి సరిత్ కుమార్‌ను అరెస్టు చేశారు. కానీ అసలు సూత్రధారి స్వప్న సురేశ్‌ను ప్రధాన నిందితురాలిగా గుర్తించారు. ఆమె కేరళ ఐటీ శాఖలో కన్సల్టెంట్‌గా ఉన్నారు. ఈమె సీఎం ముఖ్య కార్యదర్శి శివశంకర్‌కు బాగా దగ్గర. ఈ అధికారి వల్ల స్వప్నా సురేష్ .. సీఎంవోలో పట్టు సాధించారు. అదే ఇప్పుడు రాజకీయ కలకలకానికి కారణం అవుతోంది. విజయన్‌కు.. స్వప్నా సురేష్‌కు ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ వ్యవహారం.. తన మెడకు చుట్టుకుంటూండటంతో… కేరళ సీఎం విజయన్… కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని కేంద్రానికి లేఖ రాశారు. దీంతో స్మగ్లింగ్ విచారణ బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ కు అప్పగించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. ఈ వ్యవహారం దేశ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని హోం శాఖ పేర్కొంది. ఎన్ఐఏ విచారణలో అసలు వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.