స్వర్ణభారతి ట్రస్టు అంటే తెలుగువారికి సుపరిచితమే. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకట్ నిర్వహించే ఈ ట్రస్టు జిల్లాలోనే గాక ఉభయ రాష్ట్రాలలోనూ సేవా కార్యక్రమాల పేరిట హడావుడి చేస్తుంటుంది. ఆయన కేంద్రంలో మంత్రిగా వుంటే మరింత జోరు పెంచుతుంది. ఇటీవలి కాలంలో కేంద్ర నేతలు రాష్ట్ర నేతలు వెంకయ్య ట్రస్టుకు వరస కడుతున్నారు. ఈ ట్రస్టు చేసే చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా పేద్ద పత్రికలు భారీ ప్రచారమిస్తుంటాయి. అయితే ఇప్పుడు నెల్లూరు నగరం నడిబొడ్డున గల వేదాయపాలం లో రిత్విక్ ఎన్క్లేవ్ లే ఔట్ పక్కన ప్రజోపయోగం కోసం అట్టిపెట్టిన 18 సెంట్ల స్థలం సదరు స్వర్ణభారతి ట్రస్టు కబ్జా చేస్తున్నట్టు కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. కార్పొరేషన్ అనుమతిలేకుండానే ఇక్కడ పార్కుకోసం ఉద్దేశించిన ఈ స్థలాన్ని ఆక్రమించారన్నది ఆరోపణ. వెంకయ్య ఇల్లు కూడా ఆ పక్కనే వుంటుంది. కంటి ఆస్పత్రి నిర్మించి సేవ చేసేందుకోసం ఏడుకోట్ల రూపాయల విలువైన ఈ స్థలాన్ని ఇవ్వాలని మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ కోరగానే అధికారగణం ఆగమేఘాల మీద ప్రతిపాదనలు సిద్ధం చేసి కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీకి ముందుంచారట. 2002లో నాటి తెలుగుదేశం ప్రభుత్వమే విడుదల చేసిన జీవో నిబంధనల ప్రకారం లే ఔట్లలో వదలిన ఖాళీ స్థలాలను ఇతర అవసరాలకు ఉపయోగించకూడదట. అయినా ఇప్పుడు నాయుడుగారి పరపతి దృష్ట్యా కార్పొరేషన్ అధికారులు కాగితాలు కదిలించారు. అయితే ఇంకా అక్కడి నుంచి ఆమోదం రాకుండానే పనులు నిర్మాణాలు మొదలెట్టేశారు. మరి వెంకయ్య నాయుడు గారా మరొకటా? అన్నట్టు గతంలోనూ అసైన్డ్ భూములు హస్తగతం చేసుకున్న ఆరోపణలకు గురైన వెంకయ్య వాటిని పంచిపెట్టాల్సి వచ్చింది. ఇక పోతే దేశంలో బడా వ్యాపార సంస్తలతో ఆయన స్నేహ సంబంధాలు సరేసరి. ఈ ట్రస్టు పనులన్నీ నిజానికి వారి సౌజన్యంతోనే జరుగుతున్నాయంటారు!