ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు..హిందూత్వంపై వైసీపీ నేతల అరాచక వ్యాఖ్యలకు పరిహారంగా.. ప్రాయశ్చిత్త హోమాలు చేపట్టాలని వైఎస్ జగన్ .. వైసీపీ నేతల ఆస్థాన స్వామిజీ స్వరూపానంద సరస్వతి సూచించారు. వరుస వివాదాస్పద ఘటనల నేపధ్యంలో.. మంత్రులు వెల్లంపల్లి, శ్రీరంగనాథరాజు విశాఖకు వెళ్లారు. స్వరూపానందతో భేటీ అయ్యారు. అంతర్వేది నూతన రథ నమూనాను చూపించారు. గతానికన్నా శ్రేష్టమైన రథం తయారు చేయాలని స్వరూపానంద వారికి సూచించారు. రథ నిర్మాణానికి ఉత్కృష్టమైన కలప వినియోగించాలని సలహా ఇచ్చారు.
అదే సమయంలో.. బిట్రగుంట, అంతర్వేది దేవస్థానాల్లో రథాలు దహనం అరిష్టానికి సూచన కాబట్టి ప్రాయశ్చిత్త హోమాలు చేపట్టాలని సలహా కూడా ఇచ్చి పంపించారు. హైందవ సాంప్రదాయాలపై అనుమానాలను నివృత్తి చేసేందుకు.. ప్రభుత్వం ఆగమ సలహా మండలిని ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. టీడీపీ హయంలో ప్రతీ చిన్న విషయాన్ని మీడియా ముందుకు వచ్చి రాజకీయ విమర్శలు చేయడంలో రాటుదేలిపోయిన స్వరూపానంద ఇప్పుడు మాత్రం మంత్రుల్ని పిలిపించుకుని.. కాస్త పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
ఏపీలో ఎంతో కాలంగా హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నా.. కొడాలి నాని వంటి వాళ్లు పేట్రేగిపోతున్నా… స్వరూపానంద ఒక్కసారంటే..ఒక్క సారి కూడా ఇది తప్పు అని చెప్పే ప్రయత్నం చేయలేదు. అందుకే ఆయనకు హిందూత్వం కన్నా..రాజకీయ ముఖ్యమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ వైపు విశాఖలోనే విశ్వ హిందు పరిషత్, హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగినా…అదే విశాఖలో ఉన్న స్వరూపానంద మాత్రం.. మంత్రులకు ఏం చేయాలో చెప్పి పంపించారు.