ఆశీర్వాదాలకు మాత్రమే పరిమితం అవుతామని చెప్పిన స్వామీజీ… ఇప్పుడు ఆరోపణలు మొదలుపెట్టారు! రాజకీయాలకు తనకు అవసరం లేదని చెప్పిన ఆయనే, ఇప్పుడు అదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానంద మీడియా ముందుకు వచ్చి… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓ కోరిక కోరారు! స్వామీజీకి అత్యంత ప్రియ శిష్యుల్లో ఒకరు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనే సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నికల ముందు నుంచీ కూడా జగన్ సీఎం కావాలని స్వామీజీ యాగాలు చేశారు, ముహూర్తాలు పెట్టారు. ఆయన చెప్తే జగన్ కేబినెట్ లో మంత్రి పదవులు వస్తాయనే ఆశతో కొంతమంది స్వామీజీని కలిస్తే… అప్పుడేమన్నారంటే, నా శిష్యులకు ఆశీస్సులు మాత్రమే ఇస్తాను, ఫలానాది చెయ్యాలని గురుస్థానంలో ఉన్న నేను కోరను అన్నారు! అయితే, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిని ఓ కోరిక కోరారనే అనొచ్చు!
ఇంతకీ స్వామీజీ ఇప్పుడు ఏమంటున్నారంటే… గత ప్రభుత్వం నిధులను అనేక రకాలుగా దుర్వినియోగం చేసిందని ఆరోపించారు స్వరూపానంద. నదీ హారతులు, పుష్కరాలు, ఇతరత్రా కార్యక్రమాల పేరుతో పెద్ద మొత్తంలో ప్రజాధనం వృథా చేసిందని గత టీడీపీ సర్కారుని విమర్శించారు. గత ప్రభుత్వ ఖర్చులపై ఒక ఎంక్వయిరీ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. చంద్రబాబు సర్కారు ఆధ్యాత్మికత పేరుతో చేసిన ఖర్చులపై భక్తులకు సరైన వివరణ ఇవ్వాలని కోరుతున్నామన్నారు. విశాఖ శారదా పీఠం తరఫున తమ డిమాండ్ ను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామనీ, అన్నింటిపైనా సమగ్ర విచారణ జరగాలని సీఎంని కోరతానని స్వామీజీ చెప్పారు.
ఇప్పటికే గత ప్రభుత్వం పనితీరుపై లెక్కలు తేల్చేందుకు ఒక మంత్రి వర్గ ఉప సంఘం పనిలో ఉంది. గత పాలనలోని 30 అంశాలపై ఆరా తీసి, అవినీతిని బయటకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పుడు స్వామీజీ కోరుతున్నారు కాబట్టి, గత ప్రభుత్వ ఆధ్యాత్మిక కార్యకలాపాలకు సంబంధించిన ఖర్చులపై కూడా సమగ్ర దర్యాప్తు ఉంటుందని భావించొచ్చు. స్వరూపానంద కోరితే… కాదనే పరిస్థితి ఏముంటుంది? అయితే, ముఖ్యమంత్రులకు ఆశీర్వాదాలు, వారి పేరున యజ్ఞయాగాలు లాంటివి స్వామీజీలు చేయడం వరకూ ఓకే. కానీ, ఇప్పుడు గత ప్రభుత్వంపై విమర్శలు, దర్యాప్తులు జరపాలంటూ డిమాండ్లు చేయడం అనేది… ఫక్తు రాజకీయ అంశాలు అవుతాయి కదా. ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్న స్వామీజీలకు ఇది తగునా అనే చర్చ మరోసారి తెరమీదికి వస్తుంది.