విశాఖ స్వయంప్రకటిత పిఠాధిపతి స్వరూపానందకు టీడీపీ ప్రభుత్వంలోనూ మంచి పలుకుబడి కనిపిస్తోంది. ఆయన అప్పనంగా కొట్టేసిన భూముల్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందేమో అనుకుంటే అలాంటిదేమీ ఉండబోదని ఆయనకు మంత్రుల సపోర్టు ఉందని ప్రచారం ఊపందుకుంటోంది. దీనికి కారణం ఆయనకు విశాఖలో జగన్ కేటాయించిన అత్యంత విలువైన భూముల రద్దు ఫైల్ ముందుకు కదలకపోతూండటమే.
జగన్ రెడ్డి, కేసీఆర్లకు అత్యంత ఆప్తుడైన స్వరూపానంద వారు అధికారంలో ఉన్నప్పుడు దండిగానే భూములు రాయించుకున్నారు. గోల్డెన్ ల్యాండ్ గా అందరూ చెప్పుకునే కోకాపేటలోనే రెండు ఎకరాలు కేసీఆర్ రాసిచ్చారు. ఇక జగన్ విశాఖలో ఓ కొండను రాసిచ్చారు. ఆ కొండ విలువ రెండు వందల యాభై కోట్లు ఉంటుంది. కేవలం ఆధ్యాత్మి అవసరాల కోసం మాత్రమే వాడుకోవాలన్నది నిబంధన. కానీ వ్యాపారం చేసుకుంటామని .. దానికి తగ్గట్లుగా నిబంధనలు మార్పించుకునేందుకు చాలా ప్రయత్నం చేశారు. ఈ లోపు ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం మారింది.
అవసరం లేకపోయినా శారదా పీఠానికి కేటాయించిన భూముల్ని ర ద్దు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆ మేరకు ఫైల్ రెడీ అయింది. కానీ రెండు నెలల నుంచి ఎక్కడివక్కడే ఉంది. తాజాగా ఓ ఉన్నతాధికారి దాన్ని వెనక్కి పంపారని అంటున్నారు. ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి భూముల కేటాయింపునురద్దు చేయకుండా అడ్డుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఆ స్వామిజీ లాంటి వాళ్లకు ప్రోత్సహం ఇస్తే పాముకు పాలు పోసినట్లేనని… వెంటనే భూములు రద్దు చేసి… శారదాపీఠంలో కబ్జా చేసిన భూములు, తిరుమలలో చేసిన ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని నేరుగా సీఎంను కలిసేందుకు కొంత మంది టీడీపీ నేతుల రెడీ అవుతున్నారు.