స్వరూపానందకు రాయల్టీ మీద విరక్తి పుట్టేసింది. ఆయన బయటకు వస్తే గ్రీన్ చానల్ ఉండేది. మఠం దగ్గర బోలెడంత మంది. పోలీసులు ఉండేవారు. రోజూ రాజకీయ నేతలు వచ్చి కాళ్ల మీద పడేవారు. ఇప్పుడు అవన్నీ పోయే సరికి ఆయనకు విరక్తి వచ్చేసింది. కాశీకి పోయి తపస్సు చేసుకుంటానని ఆయన డీజీపీకి లేఖ రాశారు. ఆయన తపస్సు చేసుకుంటే డీజీపీకి లేఖ రాయాల్సిన పని లేదు…కానీ తనకు ఇచ్చిన వన్ ప్లస్ వన్ సెక్యూరిటీని కూడా తొలగించాలని ఆయన కోరడానికి ఈ లేఖ రాశారు.
స్వరూపానంద రాజకీయ నాయకులకు పూజలు చేసివారి వద్ద నుంచి పెద్ద ఎత్తున ప్రయోజనాలు పొందారు. భూములు పొందడమే కాకుండా పెద్ద ఎత్తున లాబీయింగ్ చేసి పదవులు ఇప్పించడం.. బదిలీలు చేయించడం..దేవాదాయ శాఖను గుప్పిట్లో పెట్టుకోవడం వంటివి చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆయనకు కేటాయించిన స్థలాల్ని స్వాధీనం చేసుకున్నారు. తిరుమలలో ఆయన నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. విశాఖలోని చినముషిడివాడలో ఆశ్రమం సగం కాలువను ఆక్రమించి నిర్మించారని బయటపడింది.
ఈ వ్యవహారాలతో ఆయన ఆందోళన చెందుతున్నారు. తాను చేసిన తప్పుడు పనులకు ఎక్కడ ఫలితం అనుభవించాల్సి వస్తుందో అని ఏపీ నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఆయనకు కోకాపేటలో రెండు ఎకరాలు ఇచ్చింది. అక్కడే ఉండటం లేదా..కాశీకి పోయి తపస్సు చేసుకుంటానని ఆయన అంటున్నారు. అధ్యాత్మికం పేరుతో రాజకీయ నేతలతో అంటకాగితే.. దేవుడు ఇలానే శిక్షిస్తాడని భక్తులు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు.