ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా తన ఆశీస్సులతోనే అన్నట్లుగా షో చేసే స్వరూపానందకు ఏపీ సర్కార్ తీసుకున్న ఓ నిర్ణయం అసలు నచ్చలేదు. అదే బీసీ సంక్షేమ లో బ్రాహ్మణ కార్పొరేషన్‌ను విలీనం చేయడం. ఇటీవలే రిషికేష్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్షలు చేయడం ప్రారంభించారేమో కానీ దేవాదాయశాఖ కింద ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్‌ను.. బీసీ సంక్షేమ శాఖ కిందకు మార్చడం గురించి ఆయన ఆశ్చర్యపోయారు. వెంటనే ఈ సమాచారాన్ని మీడియాకు కూడా తెలియచేశారు.
శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడమే కాదు.. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయం తో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఒక ప్రకటనలో స్వామీజీ అందరికీ తెలియచేశారు. నిజంగా ఆయనకు నచ్చకపోతే నేరుగా సీఎంతో మాట్లాడి ఆ నిర్ణయాన్ని ఉపసంహరింప చేసి ఆ తర్వాత మీడియాకు చెప్పి ఉండేవారు. కానీ తనకు నచ్చలేదని.. సీఎంవోతో మాట్లాడుతున్నామని స్వరూపానంద ఆశ్రమం ప్రకటన ఇచ్చింది.
ఈ అంశంలో బ్రాహ్మణ వర్గం నుంచి వ్యతిరేకత ఉందన్న కారణంగా ఇలా స్వరూపానందతో ప్రకటన చేయించారన్న అభిప్రాయం కూడా కొంత మందిలో వినిపిస్తోంది. ఎందుకంటే జగన్ నిర్ణయాలను ఎప్పటికప్పుడు సమర్థించడమే కానీ వ్యతిరేకంగా మాట్లాడితే ఏం జరుగుతుందో స్వరూపాదనందకు తెలియకుండా ఉండదని అంటున్నారు. స్వరూపానంద చెప్పారని.. ఆయనకు నచ్చలేదని రేపు బ్రాహ్మణ కార్పొరేషన్‌ను మళ్లీ దేవాదాయశాఖకు కిందకు తెస్తారేమోనని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.