తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలు… పదిహేనేళ్ల పాటు దిగ్విజయంగా పరిపాలించాలని స్వరూపానందస్వామి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి దీక్షా సన్యాస స్వీకరణ మహోత్సవం విజయవాడలోని కృష్ణానదీ తీరాన గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో జరిగింది. దీనికి సోమవారం రాజకీయకళ వచ్చింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరితో పాటు.. పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ఇద్దరూ సీఎంలు రావడం.. స్వరూపానందను మహాదానందానికి గురి చేసింది. అందుకే ఇద్దరిపై.. ప్రశంసల వర్షం కురిపించారు. పొగడ్తలతో హోరెత్తించారు. తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి కేసీఆర్ అని సర్టిఫికెట్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ వచ్చి… ఉత్తరాధికారి దీక్షా స్వీకరణ కార్యక్రమాన్ని ఆస్వాదించడం శుభపరిణామమన్నారు. కేసీఆర్ మహా మేధావి… మహాభారతాన్ని రెండుసార్లు చదివిన వ్యక్తి మా కేసీఆర్ అని పొగిడారు.
జగన్, కేసీఆర్ అంటే నా ప్రాణసమానులన్నారు. అగ్నిసాక్షిగా చెబుతున్నా..నా హృదయంలో ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి జగన్ అని ఒట్టు వేశారు. 15ఏళ్లు దిగ్విజయంగా కేసీఆర్, జగన్ పాలించాలన్నారు. ఈ సందర్భంగా శారదా పీఠం గురించి కూడా…స్వరూపానందగొప్పగా చెప్పుకొచ్చారు. భవిష్యత్తును చెప్పే ఏకైక పీఠం విశాఖ శారదాపీఠమేనన్నారు. తెలుగునాట అధర్మం ఓడి ధర్మం గెలిచింది అనేందుకు… ఈ ఇద్దరు రాజులే నిదర్శనమని చెప్పుకొచ్చారు. పూర్తి అధ్యాత్మిక వాతావరణంలో..సన్యాసికార దీక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ… స్వరూపానంద స్వామి.. ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చిన ఉత్సాహంతో..రాజకీయ ప్రసంగం చేయడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
వ్యక్తిగత, రాగద్వేషాలకు అతీతంగా స్వాములు ఉంటారని చెబుతారు కానీ… స్వరూపానంద మాత్రం… తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పొగిడేందుకు.. ఇతరులను విమర్శించడానికి కూడా వెనుకాడలేదు. అంతే కాదు.. శారదాపీఠం జ్యోతిష్యాలయం అయినట్లుగా.. కచ్చితంగా ఊహించి చెప్పగలిగేది.. తమ పీఠం ఒక్కటేనని చెప్పుకుని.. ఇతర పీఠాలను కించ పరిచారనే గుసగుసలు కూడా వినిపించాయి. కానీ.. స్వరూపానంద ఇప్పుడు పవర్ ఫుల్. ఆయన ఎమన్నా.. ఎవరూ నోరు తెరిచే పరిస్థితి లేదు.