ఓ చిన్న ఓమ్ని బస్‌కు మూడేళ్ల పాటు పన్ను మినహాయింపు ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సాధారణంగా కమర్షియల్ వాహనాలకు మూడు నెలల కోసారి సీట్ల సంఖ్య ఆధారంగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. సీటుకు.. ఐదు వందలో.. ఆరు వందలో వాహనాన్ని బట్టి ఉంటుంది. ఈ పన్నునూ ఆ ఓమ్ని బస్‌కు మూడేళ్ల పాటు మినహాయించారు. ఈ ఉత్తర్వులు చూసిన అందరికీ మైండ్ బ్లాంక్ అయింది. ఆ ఓమ్నీబస్ ఎవరిదంటే… విశాఖ స్వరూపానంద స్వాముల వారిది.
సీఎం జగన్ కావడానికి హోమాలు చేశానని … అందుకే ఆయన సీఎం అయ్యారని చెప్పుకోవడానికి ఏ మాత్రం మొహమాట పడని స్వరూపానంద… ఆ పదవి తానిచ్చిన ప్రతిఫలమే కాబట్టి.. ఏమైనా కోరుకోవచ్చు… సాధించుకోవచ్చని అనుకుంటున్నారు. తన ఆశ్రమానికి ఓ పదిహేను ఎకరాల విలువైన స్థలాన్ని ఇటీవల కేబినెట్ భేటీలో కేటాయింప చేయించుకున్నారు. కబ్జా అని ఆరోపణలు ఉన్న స్థలాల్ని క్రమబద్దీకరించుకున్నారు. చివరికి తిరుమలలో పీఠం తరపున కట్టిన భవనంకు ఇచ్చిన స్థలం కన్నా ఎక్కువ దాంట్లో కట్టేసి.. చివరికి రెగ్యులరైజ్ చేసుకున్నారు. ఇవన్నీ ఆయన రేంజ్‌కు తగ్గట్లుగానే ఉన్నాయి. సీఎంకు గురువు కాబట్టి ఆ స్థాయిలో చేయించుకున్నారని అనుకున్నా.. ఇప్పుడు స్వరూపానంద మరీ చిల్లర స్థాయికి దిగజారిపోయారు.
చివరికి ఓమ్నిబస్లో ఉండే పది.. ఇరవై సీట్లకు కూడా పన్ను కట్టకుండా మూడేళ్ల పాటు మినహాయింపు తెచ్చుకున్నారంటే ఆయన ప్రభుత్వాన్ని.. జగన్ వద్ద ఉన్న పలుకుబడిని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో సులువుగానే అర్థం చేసుకోవచ్చంటున్నారు. గతంలో ఆయన ఆశ్రమంలో జరిగే కార్యక్రమాలకు ఆలయాల నుంచి విరాళాలు ఇవ్వాలన్న ఉత్తర్వులు కూడా వచ్చాయి. కానీ వివాదాస్పదం కావడంతో నిలిపివేశారు. చివరికి తన ఆశ్రమానికి చెందిన వాహనాకలకు కూడా పన్ను మినహాయింపు పొందుతున్నారంటే ఇక బయటకు రాకుండా ఎన్నెన్ని మినహాయింపు… లాభాలు ప్రజాధనం నుంచి పొందుతున్నారో .. కొత్త ప్రభుత్వం వచ్చి లెక్క బయటకు తీస్తేనే తెలుస్తుంది.