ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో స్వరూపానంద స్వామి కేసీఆర్ కోసం రాజశ్యామల యాగం ప్రారంభించారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఈ యాగం జరుగుతోంది. ఈ సారి తనతో పాటు తన వారసుడిగా ప్రకటించిన స్మాత్మేత్రానందను కూడా యాగంలో భాగం చేశారు. రెండు వందల మంది రుత్విక్కులతో ఈ యాగం సాగుతోంది. ఉదయమే కేసీఆర్ చేతుల మీదుగా సంకల్పంతో శ్రీకారం చుట్టారు. రెండో రోజు వేదపఠనం, హోమం తదితర పూజలు నిర్వహిస్తారు. చివరి రోజు పూర్ణాహుతి ఉంటుంది.
కేసీఆర్ యాగాలు తరచూ నిర్వహిస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. రాష్ట్రం, ప్రజలు అభివృద్ధి చెందాలని 2015లో చండీ యాగం నిర్వహించారు. అనంతరం.. 2018 ఎన్నికల రెండో విడతకు వెళ్లకముందే సీఎం కేసీఆర్ తన ఫాంహౌస్లో రాజశ్యామల యాగం నిర్వహించారు. ఆ యాగం తర్వాత ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ రెండోసారి రాష్ట్రంలో అధికారం సాధించారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికల ముందు రాజ శ్యామలా యాగం చేసి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజేతగా నిలిచారు. ఎన్నికల విజయం అనంతరం సహస్ర చండీ యాగం నిర్వహించారు.
బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సందర్భంగా ఢిల్లీలో యాగం జరిగింది. కేసీఆర్ యాగం చేసిన ప్రతిసారీ దానికి ప్రతిఫలం దక్కుతుందని పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రడ్డి కూడా ముందుగానే రాజశ్యామల యాగం చేశారు. కొడంగల్ లోని ఆయన నివాసంలో ఈ యాగం జరిగింది. పోటాపోటీగా అందరూ రాజశ్యామల యాగాలు చేయడంతో ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారుతోంది.