విశాఖ స్వరూపానంద స్వామికి ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక మర్యాదలు.. పూజలు చేయాలంటూ.. ఏపీ దేవాదాయ శాఖ వివాదాస్పద ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల పద్దెనిమిదో తేదీన స్వరూపానంద జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆయన పీఠం అయిన శారదాపీఠం తరపున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన పీఠం.. ఆయన ఖర్చులు కాబట్టి ఎవరూ అభ్యంతరం చెప్పరు. పీఠం ఖర్చులతో ఆలయాల్లో ప్రత్యేకంగా తమ ఖర్చులు పెట్టుకుని పూజలు చేయించుకుంటే సమస్య వచ్చేది కాదు . కానీ శారదా పీఠం తరపున ప్రభుత్వానికి.. ఓ విజ్ఞానన పత్రం వెళ్లింది. అందుకో.. ఏపీలో ఉన్న ప్రముఖ ఆలయాల జాబితాను ఇచ్చారు.
స్వరూపానంద జన్మదినోత్సవం సందర్భంగా తాము చెప్పిన ఆలయాల్లో ప్రత్యేక ఆలయ మర్యాదలు పూజలు చేయాలని అందులో కోరారు. అసలే ఆయన రాజ గురువు.. అలా కోరిన తర్వాత కూడా స్పందించకపోతే.. ప్రభుత్వ పెద్దలకు కోపం వస్తుందనుకున్నారో.. లేకపోతే.. పై నుంచే ఆదేశాలు వచ్చాయో కానీ వారు అడిగినట్లుగా ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేకమైన ఆలయ మర్యాదలు చేయాలని ఆదేశిస్తూ.. దేవాదాయ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. స్వరూపానంద ఓ స్వయం ప్రకటిత పీఠాధిపతి మాత్రమే. ఆయనకు ఎలాంటి ప్రత్యేకమైన హోదా లేదు. కానీ ప్రభుత్వ పెద్దల అండ ఉందన్న ఉద్దేశంతో .. ఆయన పట్ల అధికారులు కూడా గౌరవ భావంతో మెలుగుతున్నారు.
రాజును మించి రాజభక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇలా దేవాయాల్లో ప్రత్యేక ఆలయ మర్యాదలు చేయడం అంటే.. ఓ రకంగా ఏపీలో దేవాలయాలపై ఆయనకు.. ఎవరికీ లేనంత పట్టు ఉందని.. ప్రభుత్వం చప్పడమే అవుతుంది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేవుళ్లను కించ పరుస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో శారదాపీఠంలో నిర్వహించే ఓ కార్యక్రమాలని ఆలయాల నుంచి చందాలు ఇవ్వలనే ఉత్తర్వులు ఇచ్చారు. వివాదాస్పదం అయ్యే సరికి ఉపసంహరించుకున్నారు.