SwathiMuthyam movie Review
తెలుగు360 రేటింగ్ 3/5
పాత కథనే కొత్తగా చెప్పడం ఒక నేర్పు. కొత్తగా వస్తున్న దర్శకులు కొంత మంది ఈ నేర్పుని చక్కగా ఒడిసి పట్టుకుంటున్నారు. చిన్న పాయింట్ ని తీసుకొని దాని చుట్టూ ఫ్రెష్ స్క్రీన్ ప్లే అల్లుకొని హిట్లు కొడుతున్నారు.’స్వాతి ముత్యం’ దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ కూడా ఇదే దారిలో వెళ్ళాడు.’స్వాతి ముత్యం’ అంటూ ఓ క్లాసిక్ టైటిల్ ని తీసుకున్నాడు. ఇది వరకూ కొన్ని సినిమాల్లో చూసిన ఓ పాయింట్ నే కథగా అల్లుకున్నాడు. బెల్లం కొండ గణేష్ హీరోగా పరిచమైన సినిమా ఇది. సితార ఎంటర్ టైన్మెంట్ నిర్మించింది.
మరి పాత కథనే కొత్తగా చెప్పాలనుకున్న దర్శకుడి ప్రయత్నం ఫలించిందా ?
గణేష్ కి తొలి విజయం వరించిందా ?
బాలమురళి కృష్ణ అలియాస్ బాల (బెల్లం కొండ గణేష్) ఎలక్ట్రసిటీ డిపార్ట్మెంట్ లో జూనియర్ ఇంజనీర్. చాలా మంచోడు.స్వాతిముత్యం టైపు.
బాలాకి పెళ్లి సంబంధాలు చూస్తుంటాడు తండ్రి వెంకట్రావ్ (రావు రమేష్) ఏవో కారణాలతో కొన్ని సంబంధాలు తప్పుతాయి. తన పెళ్లి చూపుల్లో భాగంగా భాగ్యలక్ష్మీ (వర్ష బొల్లమ్మ)ని చూస్తాడు బాలా. మొదటి చూపులోనే నచ్చేస్తుంది. భాగ్యలక్ష్మీకి కూడా బాలా నచ్చేస్తాడు. ఇంట్లో పెద్దలు తాంబూలాలు పుచ్చుకుంటారు. పెళ్లి ముహూర్తం పెట్టేస్తారు. సరిగ్గా పెళ్లి రోజున బాలా జీవితంలోకి ఊహించిన మలుపు చోటు చేసుకుంటుంది. శైలజ (దివ్య శ్రీపాద) తొమ్మిది నెలల బిడ్డతో వచ్చి ఆ బిడ్డకు తండ్రి బాలానే అని అందరిముందూ చెబుతుంది.ఆ బిడ్డకు తండ్రి తనే అని ఒప్పుకుంటాడు బాలా. రెండు కుటుంబాలు షాక్ అవుతాయి. అసలు.. శైలజ ఎవరు ? ఒక బిడ్డకు తండ్రయిన బాలా , భాగ్యలక్ష్మిని ఎందుకు ప్రేమిస్తాడు, ఆమె పెళ్లికి ఎందుకు సిద్దపడతాడు ? స్వాతిముత్యం లాంటి బాలా ఇలాంటి పని ఎందుకు చేస్తాడు ? ఇంతకీ ఆ బాబు ఎవరు ? చివరికి బాలా కథకి ఎలాంటి ముగింపు దొరికిందనేది తెరపై చూడాలి.
కథలు కొత్తగా ఎక్కడా పుట్టవు. ఉన్న కథలనే కొత్తగా చెప్పాలి. కొత్త దర్శకుడు లక్ష్మణ్ ఈ కొత్త రూట్ నే ఫాలోయ్యాడు. పాత పాయింట్ నే కొత్తగా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. దిగ్గజ సంగీతం శ్రీనివాసరావు తీసిన వెల్ కమ్ఒబామా నుంచి మొన్న వచ్చిన ‘మిమి’ వరకూ ‘సరోగసి’ పై చాలా సినిమాలువచ్చాయి. విక్కీ డొనర్ ని తెలుగులో కూడా రీమేక్ చేశారు. దర్శకుడులక్ష్మణ్ ఇదే పాయింట్ ని చాలా కొత్తగా, ఫ్రెష్ గా ఎక్కడా బోర్ కొట్టకుండా‘స్వాతిముత్యం’ గా చూపించాడు.సినిమా చాలా ఫ్రెష్ నెస్ తో మొదలౌతుంది. బాలా ఓ పెళ్లి చూపులకివెళ్తాడు. అదే రోజు రాత్రి బాలా తమ్ముడు ఆ ఇంట్లోకి గోడ దూకి పెళ్లి కూతురు చెల్లిని కలుస్తాడు. బోనస్ గా అక్కడే బైక్ వదిలివస్తాడు.పొద్దున్న పెళ్లి చూపులకి వెళ్ళిన తండ్రితో కలసి వెళ్ళిన బాలాకి సంగతి తెలుస్తుంది. తండ్రితో నాలుగు చీవాట్లు తిని తల దించికొని వచ్చేస్తాడు.నేటివిటికీ చాలా దగ్గరగా వున్న సన్నివేశమిది. అప్పుడే ఆ పాత్రలని ప్రేక్షకుడు ఓన్ చేసుకుంటాడు. బాలా ఆఫీస్ లో జరిగే సన్నివేశాలు, అందులోంచి పుట్టుకొచ్చిన హస్యం కూడా చాలా ఆహ్లాదంగా వుంటుంది. బాలా, భాగ్య లక్ష్మిని కలవడం , వారి మధ్య జర్నీని చాలా ఫ్రెష్ గా రాసుకున్నాడు దర్శకుడు. చుస్తున్నంత సేపు వారి కెమిస్ట్రీ హాయిగా వుంటుంది. ఇక ఇంటర్వెల్ కి ముందు అసలు కథలోకి వస్తాడు దర్శకుడు.
అయితే ఈ పాయింట్ కొత్తది కాదని దర్శకుడికి తెలుసు. అందుకే మిగతా పాత్రల నుంచి వినోదం రాబట్టుకోవడంపై ద్రుష్టిపెట్టాడు. ‘పెద్ద మనిషి’ పాత్రలో గోపరాజు రమణ పాత్రని పరిచయం చేసి రావు రమేష్ ని ఫ్రంట్ లైన్ లోకి తీసుకొచ్చి స్క్రీన్ ప్లే ని హిలేరియస్ గా డిజైన్ చేశాడు. ఇది చాలా బాగా వర్క్ అవుట్ అయ్యింది. నిజానికి ఈ సినిమా సెకండ్ హాఫ్ లో అసలు కథ చెప్పడానికి ఇంకేం మిగల్లేదు. హీరో తనకి జరిగింది చెబితే అక్కడితో కథ అయిపొయింది. కానీ హీరో చెప్పేది వినడానికి ఎవరూ సిద్ధంగా వుండరు. ఈ పాయింట్ మీద సెకండ్ హాఫ్ రన్ చేయడం అంత తేలిక కాదు. కానీ ఈ విషయంలో దర్శకుడి తెలివి తేటల్ని మెచ్చుకోవాలి సరోగసి ఋషులు ముణులతో పోల్చడం, సుబ్బరాజు పెళ్లి చూపులు, గోపరాజు పెద్దరికం, రావురామేష్ మ్యానరిజం … ఇవన్నీ సినిమాని గట్టెక్కించేశాయి దర్శకుడు రాసిన అన్ని సీన్లు పేలాయి. సినిమాని ముగించిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. కొన్ని సినిమాల నుండి అద్భుతాలు ఆశించం. చూసినంత సేపు హాయిగా గడిచిపొతే చాలు. స్వాతిముత్యం అలా హాయిగా నడిచిపోయే సినిమా.గణేష్ స్క్రీన్ తొలి సినిమా ఇది. తనకి ఎలాంటి ఇమేజ్ లేదు. అందుకే ఈ కథ సరిగ్గా నప్పింది, తన స్క్రీన్ ప్రజన్స్ బావుంది. భవిష్యత్తులో ఎలాంటి కథల్ని ఎంచుకొంటాడు? అనేదానిపై గణేష్ కెరీర్ ఆధారపడి ఉంది. తొలి సినిమాకైతే.. తను పాస్ మార్కులు కొట్టేశాడు. తనని దృష్టిలో ఉంచుకొని దర్శకులు కథలు రాసుకోవొచ్చు. వర్ష బొల్లమ్మ అందంగా వుంది. తన పాత్రలో ఒదిగిపోయింది. రావు రమేష్, గోపరాజు రమణ ఈ సినిమాకి సెకండ్ హీరోలు.
అద్భుతంగా చేశారు. వినోదం అంతా వాళ్ళదే. సుబ్బరాజు సీన్లు పేలాయి. క్యారెక్టర్ ఆర్టిస్టులు సినిమాని నిలబెట్టిన వైనం ఈమధ్య కాలంలో చూళ్లేదు. సరైన ఆర్టిస్టులు పడితే సాధారణ కథ కూడా ఏ స్థాయికి వెళ్తుంది అని చెప్పడానికి ఈ సినిమాని ఓ ఉదాహరణగా తీసుకోవచ్చు. ముఖ్యంగా రావు రమేష్… చితగ్గొట్టేశాడు. గోదావరి యాస, అతని వెటకారం, బాడీ లాంగ్వేజ్ చాలా సీన్లని నిలబెట్టాయి. దివ్య శ్రీపాద డి కీలకమైన పాత్ర. వెన్నెల కిషోర్, ప్రగతి, నరేష్, సురేఖ వాణి తమ అనుభవాన్ని చూపించారు, మిగతా నటీనటులు పరిధిమేర చేశారు మహతి స్వరసాగర్ మ్యూజిక్ డీసెంట్ గా వుంది. చక్కని నేపధ్య సంగీతం కుదిరింది. కెమరాపనితనం నీట్ గా వుంది. ప్రతి ఫ్రేం కలర్ ఫుల్ గా వుంటుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా వున్నాయి. దర్శకుడు రచన ఈ సినిమాని ప్రధానబలం. చాలా డైలాగులు పేలాయి. ‘’ఇదీ పెద్ద మనిషి మాట’’ అనే డైలాగు థియేటర్ అంతా నవ్వుతెప్పిస్తుంది. ఈ సినిమా కోసం స్వాతిముత్యం అనే క్లాసిక్ టైటిల్ తీసుకున్నారు. ఆ క్లాసిక్ టైటిల్ కి ఎక్కడా మచ్చరాకుండా చక్కని వినోదం పంచిన సినిమా ఇది.
ఫినిషింగ్ టచ్: మెరిసిన ముత్యం
తెలుగు360 రేటింగ్ 3/5