రాంగోపాల్ వర్మ చాలా ప్రాక్టికల్. ఎంత ప్రాక్టికల్ అనేది రామూ మాటల్ని బట్టి అర్థమవుతూనే ఉంటుంది. తను మైక్ ముందు, కెమెరా ముందు మాత్రమే ఇలా ఉంటాడనుకోవడం పొరపాటు. ఇంట్లో, తన వాళ్ల మధ్య, అక్కా చెల్లెళ్ల మధ్య కూడా అలానే ఉంటాడు. అందుకో చిన్న ఉదాహరణ ఇది.
వర్మకి విజయలక్ష్మి అనే సోదరి ఉన్నారు. ఆమెకు రేడియో అంటే చాలా ఇష్టం ఉండేదట. ఆ ఇష్టం తెలుసుకుని, ఓసారి ఓ బుల్లి రేడియో కొనిపెట్టాడు వర్మ. అది విజయలక్ష్మి కూడా చాలా ఇష్టంగా చూసుకునేవారు. ఓరోజు ఆ రేడియో కింద పడి పగిలిపోయింది. దాంతో.. విజయలక్ష్మి ఏడుస్తూ కూర్చుంటే, వర్మ అక్కడికి వచ్చి.. ‘రేడియో పగిలిపోతే రిపేరు చేయాలి.. ఏడిస్తే అతుక్కోదు..’ అన్నాడట. అప్పటికి వర్మ దర్శకుడూ కాదు. సినిమాల్లోకే అసలు రాలేదు. అంత ప్రాక్టికల్ మనిషి వర్మ. తనకు కూడా సంగీతం అంటే చాలా ఇష్టం. రేడియో అంటే మరీ ఇష్టం. ఓ రోజు రేడియో లోంచి సుశీల పాట వస్తుంటే.. ‘ఏంటి.. రేడియో లోంచి అమృతం కారుతోంది..’ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడట.
వర్మకి సెంటిమెంట్లంటే పడదని చెబుతుంటారు కానీ… వర్మ దానికి అతీతుండేం కాదు. అమ్మా – చెల్లెలు ఏడిస్తే అస్సలు నచ్చదట. వర్మ నాన్న పోయినప్పుడు కూడా.. వాళ్లు ఎమోషన్ అవ్వకుండా చూసుకున్నాడట. ఇంట్లోకి ఎవరొచ్చినా, అమ్మా, చెల్లె ఎమోషన్ అవుతారని అనుకుని… ఇంటికి గడియ పెట్టి, ఎవరూ రాకుండా ఇద్దరు మనుషుల్ని కాపలా పెట్టాడట. ”ఏడిస్తే బాధ పోదు. దానికి సొల్యూషన్ వెతకాలి అనేది.. వర్మ సిద్ధాంతం. అందులో లాజిక్ కూడా ఉంది. తనకు ఏడిస్తే ఎంత మాత్రం నచ్చదు. ఆ ఒక్క విషయంలోనే తనతో నాకు గొడవ అయ్యేది. ఆ తర్వాత్వాత మెల్లమెల్లగా తన రూటులోకి మేం వెళ్లిపోయాం” అని చెప్పుకొచ్చారు విజయలక్ష్మి.
వర్మకి అమ్మాయిల పిచ్చి అనుకుంటారంతా. అఫ్కోర్స్ ఆయన మాటలు, చేష్టలూ అలానే ఉంటాయి. వీటిపై కూడా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పుకొచ్చారు విజయలక్ష్మి. వర్మ అమ్మాయిలకు కాంప్లిమెంట్లు ఇస్తాడు గానీ, వాళ్లతో అసభ్యంగా ప్రవర్తించడని, ఒకవేళ అలా ప్రవర్తించి ఉంటే, ఇన్నేళ్లలో ఒక్క అమ్మాయైనా వర్మకు వ్యతిరేకంగా మాట్లాడేదని, అలా జరగలేదంటే… తను వాళ్లతో ఎంత హుందాగా ఉండేవాడో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
”వర్మకు జయసుధ, శ్రీదేవి అంటే ఇష్టం. జయసుధ దగ్గరకు వెళ్లి ‘మీ తరవాతే శ్రీదేవి’ అనేవాడు. శ్రీదేవి దగ్గరకు వెళ్లి.. ‘మీ తరవాతే ఎవరైనా’ అనేవాడు. వాళ్లకూ తెలుసు. వర్మ అలా ఎందుకు మాట్లాడుతున్నాడో అని. చిన్నప్పుడు మా ఇంటికి తరచూ ఓ అమ్మాయి వచ్చేది. ‘మీ కళ్లు చాలా బాగున్నాయండీ’ అనేశాడోసారి. మేం ఆశ్చర్యపోయాం. ఆ అమ్మాయితో అప్పటి వరకూ ఎవరూ అలా మాట్లాడలేదు. పైగా తనది మెల్లకన్ను. ‘ఏంట్రా అలా అనేశావు.. తనకు మెల్లకన్ను’ కదా? అని అడిగితే… ‘నేను మాత్రం చూశానేంటి? తను హ్యాపీగా ఫీలవుతుంది కదా అని అనేశా’ అన్నాడు. ఓసారి బ్యాంకు వెళ్లాం. అక్కడకు కొత్తగా క్యాషియర్ వచ్చింది. తనని చూసి `మీ నవ్వు బాగుందండీ` అన్నాడు. అప్పటినుంచీ.. నేనెప్పుడు కనిపించినా, అవసరం ఉన్నా, లేకపోయినా నవ్వుతూనే ఉండేది. వర్మకు కాంప్లిమెంట్లు ఇవ్వడం ఇష్టం. వాళ్లని ఆ క్షణానికి హ్యాపీగా ఉంచడం ఇష్టం” అని ఓ సోదరిగా వర్మని తాను అర్థం చేసుకున్న విధానాన్ని బయటపెట్టారామె.