స్విస్ ఛాలెంజ్.. ఇది సామాన్యుడికి అర్థం అయ్యే వ్యవహారం అయితే కాదు. తెలుసుకోవాలని అదే పనిగా పత్రికల్లోనూ, ఇంటర్నెట్ లోనూ శోధించి చదివినా.. అంత సులభంగా క్లారిటీ రాదు! ఇలాంటి వ్యవహారాలు మన దేశంలో చెల్లుబాటు కావు అనే విమర్శ మాత్రం గట్టిగా వినిపిస్తోంది. అలాగే ఇక్కడ భూములిచ్చిన రైతులకు కూడా ఇది శ్రేయస్కరం కాదనేది మరో మాట. ఈ వాదనకు ప్రధానమైన బలం .. న్యాయపోరాటంలో వస్తోంది. ఇక్కడి భూములిచ్చిన రైతులు తమ అభ్యంతరాలు తెలపాలంటే.. దేశం దాటి, ఖండం దాటి వెళ్లాలి.. అనేది గమనించాల్సిన విషయం.
అమరావతి పరిధిలో సింగపూర్ కన్సార్టియం ఆధ్వర్యంలోకి వెళ్లే భూమికి సంబంధించి ఏ వివాదాన్ని అయినా.. లండన్ కోర్టు వెళ్లి పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.. అనేది ఈ ఒప్పందాలపై ప్రాథమిక అధ్యయనం తర్వాత అర్థమయ్యే విషయం. మరి మన దేశంలో కోర్టులకు వెళ్లి తట్టుకుని నిలబడటమే సామాన్యులకు సాధ్యం కాదు.. అలాంటిది లండన్ కోర్టుకు వెళ్లి పోరాడలంటే.. అది సామాన్యులకు సాధ్యంఅయ్యే విషయం కాదు. అంతే కాదు.. ఒకరకంగా ఇది దేశ సార్వభౌమాధికారాన్ని కూడా పణంగా పెట్టడమే!
ఆంధ్ర ప్రదేశ్ భారతదేశంలో భాగం. ఏపీ మాత్రమే కాదు.. కాశ్మీర్ గురించి కన్యాకుమారి వరకూ ఎక్కడ మన సార్వభౌమాధికారం దెబ్బ తిన్నా మనం తట్టుకోలేం. ఎక్కడైన మన భూభాగాన్ని మ్యాపుల్లో గుర్తించలేదంటే.. మనం ఆ మ్యాప్ లను గీసిన వాళ్లపై విరుచుకుపడుతూ ఉంటాం. అలాంటిది మన భూ భాగానికి సంబంధించిన వివాదాలను, మన భూమిపై వివాదాలను పరిష్కరించుకోవడానికి, దానిపై హక్కుల కోసం లండన్ కోర్టు వెళ్లడం అంటే.. భూములిచ్చిన రైతుల ప్రయోజనాలను పూర్తిగా తాకట్టుపెట్టడమే! అమరావతికి సేకరించిన భూమి అంతటి విస్తీర్ణం లేని దేశం చేతిలో మన ప్రయోజనాలను తాకట్టు పెట్టడం దారుణమని, కనీసం అక్కడి ప్రభుత్వ భాగస్వామ్యం కాకుండా.. అక్కడి ప్రైవేట్ కంపెనీల కన్సార్టియంకు 58 శాతం హక్కులిచ్చి, 42 శాతానికి మన ప్రభుత్వంపై పరిమితమై.. ఇంకా వివిధ ఒప్పందాలను రహస్యంగా ఉంచడం ఏమిటి? అనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. రాజకీయాలను పక్కనపెట్టి.. ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తే మంచిది.