ఇంటిరేషన్ నుంచి ఇంటర్నెట్ వరకూ అన్నీ ఫ్రీగా ఇస్తామని ప్రభుత్వాలు హామీలివ్వడం, చాలాచోట్ల ప్రజలు గుడ్డిగా నమ్మి ఓట్లు వేయడం మనదేశంలో మామూలే. ప్రజలను బిచ్చగాళ్లను చేయడం ప్రభుత్వాలకు మంచిది కాదని విమర్శలు వచ్చినా పార్టీలు మారడం లేదు. చాలా చోట్ల ప్రజలు కూడా మారడం లేదు. ఫ్రీగా ఇచ్చే తాయిలాల కోసం ఎగబడటం షరామామూలే. చివరకు అర్హత లేని వాళ్లు కూడా పేదల పేరుతో ఇచ్చే తాయిలాల కోసం పోటీ పడుతుంటారు.
స్విట్జర్లాండ్ ప్రజలు మాత్రం తాము బిచ్చగాళ్లం కాదల్చుకోలేదని తేల్చిచెప్పారు. కష్టపడకుండా ఊరికే లక్షల రూపాయలను ప్రభుత్వం ఇస్తామన్నా వద్దు పొమ్మన్నారు. తమ ఆత్మగౌరవం ముందు సర్కార్ ఇచ్చే సొమ్ము తుచ్ఛమైందని తేల్చిచెప్పారు. స్వాభిమానంతో బతకడమే తమకు ఇష్టమని తీర్పుచెప్పారు.
స్విస్ ప్రజల్లో ప్రతి ఒక్కరికీ కనీసం నెలకు 2500 ఫ్రాంకులు, పిల్లలకు కనీసం 625 ఫ్రాంకులు ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈలెక్కన వయోజనులైన పౌరులకు ప్రతి ఒక్కరికీ మన కరెన్సీలో కనీసం లక్షా 70 వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. అనూహ్యంగా 76.9 శాతం మంది తమకు సర్కార్ ఊరికే ఇచ్చే సొమ్ము వద్దని తేల్చిచెప్పారు. ఈ ఫలితాలను చూసి అంతా ఆశ్చర్యపోయారు.
ప్రపంచీకరణ, రోబోల వినియోగం, అధిక యాంత్రీకరణ వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రతిపాదన చేసింది. ప్రజలందరికీ సమాన ఆదాయం ఉండాలనేది దీని ఉద్దేశం. అయితే ప్రజలు మాత్రం తమకు ఊరికే ఏదీ వద్దని తేల్చిచెప్పేశారు.
మనదేశంలోని పరిస్థితి బట్టి చూస్తే ఇది నమ్మలేని నిజం. ఖరీదైన కారున్నా తెల్ల రేషన్ కార్డు పొందే వారు లక్షల మంది కనిపిస్తారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి కోసం ఉద్దేశించిన పథకాల లబ్ధి పొందడానికి కోటీశ్వరులు కూడా పోటీ పడుతుంటారు. పేదలకోసం ఉద్దేశించిన ఆరోగ్యశ్రీ కార్డులను పొందిన వారిలో అనర్హులే ఎక్కువంటారు. ఓట్ల కోసం ఒకప్పుడ ప్రభుత్వం ఈ అనర్హులను చూసీ చూడనట్టు వ్యవహరించిందనే విమర్శలు కూడా వచ్చాయి.
ఐరోపా దేశాల్లో స్విట్జర్లాండ్ కు ఓ ప్రత్యేకత ఉంది. సాధారణంగా అక్కడి ప్రజలు అబద్ధం ఆడరని ప్రతీతి. అందుకే, ఎవరైనా ఏ విషయం చెప్తే నమ్ముతారు. కారణం, తమకు అబద్ధాలు చెప్పడం బిల్డప్ లు ఇవ్వడం అలవాటు లేదు కాబట్టి. స్విట్జర్లాండ్ సంపన్న దేశమే. మనకంటే ఎన్నోరెట్లు మెరుగైన జీవనం ఉన్నమాట నిజమే. అయినా అయాచితంగా ప్రభుత్వం లక్షల్లో డబ్బు ఇస్తామంటే కాదనడం నిజంగా ఆశ్చర్యమే. పిల్లలకు ఉచిత విద్య, పౌరులకు ఉచిత వైద్యం ప్రభుత్వ బాధ్యత. ఈ బాధ్యతను విస్మరించే ప్రభుత్వాలు, ఇతరత్రా ఉచిత తాయిలాతో ఓట్లను కొంటున్నాయనే ఆరోపణలు కొత్త కాదు. అయినా ప్రభుత్వాల పనితీరు మారడం లేదు. చాలాచోట్ల ప్రజల ఆలోచన ధోరణి కూడా మారడం లేదు. ప్రభుత్వానికి ప్రభువులైన ప్రజలే చేయిచాచి బిచ్చగాళ్లుగా మారడం ఏ పద్ధతి?