చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’పై ఎన్ని రూమర్లో. ఈ సినిమా నుంచి దర్శకుడు సురేందర్ రెడ్డి తప్పుకుంటున్నాడని, ఆ స్థానంలో వినాయక్ వచ్చేస్తున్నాడని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ తీసిన రషెష్ చిరంజీవి చూశారని, వాటిపై ఆయన అసహనంగా ఉన్నారని, అందుకే సురేందర్ రెడ్డిని తప్పించాలని చూస్తున్నారని గుసగుసలు వినిపించాయి. అంతే కాదు, నయనతార స్థానంలో మరో నాయిక వస్తుందని ప్రచారం జరిగింది. దీనిపై ‘సైరా’ వర్గాలు స్పందించాయి. టీమ్ లో కీలకమైన వ్యక్తి తెలుగు 360తో మాట్లాడారు. ఇటీవల సైరా పై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని, సురేందర్ రెడ్డి టీమ్‌లో ఉన్నారని, నయనతార స్థానానికి వచ్చిన ముప్పేమీ లేదని, టీమ్ లోంచి ఒక్కరు కూడా బయటకు వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చేశారు. ఈ తప్పుడు వార్తలపై చిత్రబృందం త్వరలోనే అధికారికంగా స్పందిస్తుందని తెలిపారు. ఫిబ్రవరిలో ‘సైరా’ కొత్త షెడ్యూల్ ఉండబోతోందని, అప్పటి నుంచి నిరవధికంగా షూటింగ్ జరుగుతుందని తెలిపారు. సో.. ‘సైరా’పై వచ్చినవన్నీ గాసిప్పులే అన్నమాట. అయితే.. ఈ విషయంపై చిత్రబృందం ఎంత త్వరగా స్పందిస్తే అంత మంచిది. లేదంటే ఈ పుకార్లే జనం నిజమని నమ్మే ప్రమాదం ఉంది.