రెండు మూడేళ్ల క్రితం రూ. 50 కోట్లు అంటే స్టార్ హీరో సినిమా రెడీ అయ్యేది. ‘బాహుబలి’తో బడ్జెట్ లెక్కలు మారాయి. కథలో దమ్ము వుండి సరిగ్గా తీస్తే వందల కోట్ల రూపాయల వసూళ్లు రావడం పెద్ద కష్టం కాదని అర్థమైంది. దాంతో నిర్మాతలు వెనుకంజ వేయడం లేదు. స్టార్ హీరోల సినిమాలను మినిమమ్ వంద కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తున్నారు. ‘బాహుబలి’ రేంజ్ సినిమా తీయాలని ‘సైరా నరసింహారెడ్డి’ స్టార్ట్ చేసిన మెగా ఫ్యామిలీ అయితే ఒక్క షెడ్యూల్‌కి రూ. 50 కోట్లకు కేటాయించిందని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ హిస్టారికల్ వార్ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ జార్జియాలో జరగనున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ యూనిట్ జార్జియా బయలుదేరింది. అక్కడ కీలకమైన యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్‌కి రామ్ చరణ్ అక్షరాలా యాభై కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించార్ట! ఖర్చు విషయంలో ఏమాత్రం రాజీ పడవద్దని దర్శకుడు సురేందర్ రెడ్డికి చెప్పి మరీ పంపించారని తెలిసింది. ఖర్చు కంటే సినిమా క్వాలిటీ ముఖ్యమని మెగా ఫ్యామిలీ భావిస్తోంది.