సైరా ట్రైలర్ దద్దరిల్లిపోయింది. ఆ ట్రైలర్‌లోని విజువల్స్ గురించీ, గ్రాండియర్ గురించి అంతా గొప్పగా మాట్లాడుకున్నారు. అయితే అది సరిపోలేదని చిత్రబృందం భావించిందేమో… ట్రైలర్ 2ని విడుదల చేసి ఆ జోష్ని మరింత పెంచింది. విజువల్‌గా సైరా ఎలా ఉండబోతోందో.. ఈ ట్రైలర్ మరోసారి రుజువు చేసింది. బ్రిటీష్ వారిపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎందుకు తిరుగుబాటు చేయాల్సివచ్చిందో.. ఈ ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. భారతదేశంలోని సంపదని పన్నుల రూపంలో దోచుకోవాలన్నది బ్రిటీష్‌వారి ఎత్తుగడ. గడ్డిపరక కూడా గడ్డ దాటకూడదన్నది నరసింహారెడ్డి పంతం. ఫలితంగా పోరాటం మొదలైంది. నరసింహారెడ్డి యుద్ధం అంతా గొరెల్లా పద్ధతిలోనే సాగింది. విచిత్రమైన వ్యూహాలతో.. ప్రత్యర్థుల్ని ముప్పుతిప్పలు పెట్టేవాడు. అవన్నీ ట్రైలర్లో మచ్చుక్కు కొన్ని కనిపిస్తున్నాయి. వార్ సీక్వెన్స్‌కి ఈ ట్రైలర్లో మరోసారి పెద్దపీట వేశారు. డైలాగులు కూడా బాగానే వినిపిస్తున్నాయి. 59 సెకన్ల ఈ ట్రైలర్ `సైరా` కోసం ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని, కొండంత నమ్మకాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.