‘సైరా’ గురించి అమితాబ్ బచ్చన్ చేసే ఒక్కో ట్వీట్ చిరంజీవి అండ్ కోకి చెమటలు తెప్పిస్తున్నాయ్. టీవీల్లో బట్టల సర్ఫ్ ‘టైడ్’ యాడ్ చూశారా? ‘అవాక్కయ్యారా…’ అంటూ వస్తుంది. అమితాబ్ చేసే ట్వీటులకు ఆ టైపులో అవాక్కవ్వడం ‘సైరా’ టీమ్ వంతవుతోంది. ఆయన షూటింగులో జాయిన్ అయ్యి రెండు రోజులు అవుతోంది. ఇప్పటివరకూ మూడు ఫొటోలు నెట్టింట్లో పెట్టారు. ఒకటి… ప్రీ-లుక్ అంటూ ఆయన లుక్ ఎలా ఉండబోతుందో హైదరాబాద్‌కి బయలుదేరే కొన్ని గంటల ముందు బ్లాగులో పోస్ట్ చేశారు. రెండు… షూటింగులో జాయిన్ అయిన తరవాత ఆయన లుక్ ట్వీట్ చేశారు. మూడు… చిరంజీవి, నయనతార లుక్స్ రివీల్ అయ్యేలా షూటింగ్ స్టిల్ బయటకు వదిలారు. ‘సైరా’లో అమితాబ్‌తో క్యారెక్టర్ చేయిస్తే… దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని చిరంజీవి అండ్ కో భావించారు. ఆ గుర్తింపు సంగతి దేవుడు ఎరుగు? ఎలాంటి హడావుడి లేకుండా చిరు లుక్ రివీల్ చేసి ‘సైరా’ టీమ్‌తో పాటు ప్రేక్షకులు, అభిమానులు ఉసూరుమనేలా చేశారు. సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ‘బాహుబలి’ తరవాత అంతటి స్థాయిలో తెలుగులో రూపొందుతోంది. బడ్జెట్ రికవరీ కావాలన్నా, సినిమాలు ‘బాహుబలి’ స్థాయిలో ప్రచారం రావాలన్నా.. ప్రతిదీ ఓ ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. కాని అమితాబ్ ఆ ఛాన్స్ ఇవ్వకుండా షాకిచ్చారు. షూటింగ్ చేసినన్ని రోజులు ఇంకెన్ని షాకులు ఇస్తారో?