టాలీవుడ్లో తెరకెక్కుతున్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘సైరా’. రామ్ చరణ్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఖైది నెం.150’ దాదాపుగా రూ.150 కోట్లు వసూలు చేసింది. దాంతో.. ఈ చిత్రానికి రూ200 కోట్ల వరకూ పెట్టొచ్చన్నది చరణ్ అంచనా. దానికి తగ్గట్టే.. బడ్జెట్ లెక్కలు తయారయ్యాయి. కాకపోతే.. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా లాంటి స్టార్లు వచ్చి చేరిపోవడంతో ఆ బడ్జెట్ కూడా పెరుగుతూ వెళ్తోంది. ఈ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించాలన్నది చిరు ఆలోచన. అమితాబ్ పోస్టర్‌తో బాలీవుడ్‌లోనూ విడుదల చేయడానికి వీలు దొరికింది. ఆ రకంగా అక్కడి మార్కెట్ ప్లస్ అయినట్టే. అందుకే బడ్జెట్ లెక్కలు పెరుగుతున్నా చిరు కామ్‌గానే ఉండిపోయాడు.
దానికి తోడు.. చరణ్‌కి ఇది ప్రతిష్టాత్మక చిత్రం. సెట్లో నటీనటులకు, సాంకేతిక నిపుణులకు రాచ మర్యాదలు మొదలయ్యాయి. ప్రతీ ఒక్కరికీ.. వాళ్ల అవసరాలకు తగ్గట్టు అన్నీ అమరిపోయేలా చరణ్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం మొదలెట్టాడు. ప్రొడక్షన్‌కీ విపరీతమైన ఖర్చు అవ్వడం మొదలైంది. దాంతో… బడ్జెట్ మరింత భారం అయ్యింది. రీషూట్ల వల్ల, షూటింగ్లో జాప్యం వల్ల… వేసుకున్న అంకెలకూ, తేలుతున్న లెక్కకూ పొంతన లేకుండా పోతోంది. దాంతో చిరంజీవి ఇప్పుడు రంగంలోకి దిగి.. బడ్జెట్‌ని కంట్రోల్ చేయడం మొదలెట్టాడట. ఇప్పటి వరకూ ప్రొడక్షన్ అంతా చరణ్ కనుసన్నల్లో జరిగేది. ఇప్పుడు చిరు జోక్యం తప్పనిసరి అయ్యింది. ఎక్కడ బడ్జెట్ కంట్రోల్ చేయొచ్చో… చిరు పరిశీలించి చరణ్‌కి గైడెన్స్ ఇస్తున్నాడట. క్వాలిటీ పేరుతో రీషూట్లు చేసే విధానానికీ ఇప్పుడు `చెక్` పడిందని సమాచారం.