సైరా నుంచి ఏం ఆశిస్తున్నారో
సైరా ఎలా ఉంటే బాగుటుందని అనుకుంటున్నారో
సరిగ్గా అలాంటివే, అలాంటివే ఏంటి… 100 % వాటినే ఏర్చి కూర్చి సైరా ట్రైలర్‌ని కట్ చేశారు. దాదాపుగా 3 నిమిషాలు పాటు సాగిన ఈ ట్రైలర్లో విజువల్ ఫీస్ట్ సినీ అభిమానుల్ని అబ్బురపరిచింది. యుద్ధ సన్నివేశాలు, ఎమోషన్, విజువల్ ఎఫెక్ట్స్, తారాబలం, దేశభక్తి… ఇలా ఒక్కటేంటి? సైరాని ఓ పూర్తిస్థాయి ప్యాకేజీగా మార్చేశారని ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది. ఇదో తొలితరం యుద్ధవీరుడి కథ. బ్రిటీష్ వారిపై పోరాడిన ఓ యోధుడి కథ. సైరా నరసింహారెడ్డి వీరత్వం గురించి – ట్రైలర్లో కొన్ని సంభాషణల్లో చెప్పించారు. `సైరా నరసింహారెడ్డి సామాన్యుడు కాదు.. కారణ జన్ముడు. అతనొక యోగి, అతనొక యోధుడు.. ఇక అతన్ని ఎవ్వరూ ఆపలేరు` అంటూ నరసింహారెడ్డి క్యారెక్టర్ని ఎలివేట్ చేశారు. ట్రైలర్లో సగం షాట్స్ బ్రిటీష్ వారి అరాచకాల్ని ఫోకస్ చేసేవే.
ఈ భూమిమీద పుట్టింది మేము.. ఈ భూమిలో కలిసేది మేము – మీకెందుకు కట్టాలిరా సిస్తు అంటూ.. సైరా బ్రిటీష్ వారిపై ఎదురుదాడిన దిగిన షాట్ చాలా కాలం గుర్తుండి పోతుంది. చిరు అభిమానులకు ఈ ట్రైలర్ ఓ కనుల పండుగ. చివరి కోరిక ఏమిటని న్యాయమూర్తి అడిగితే `గెటౌట్ ఆఫ్ మై కంట్రీ`అంటూ ఎలిగెత్తి చాటి, బ్రిటీష్ వారిపై ఎర్రజెండా ఎగరేశాడు నరసింహారెడ్డి. టీజర్లో అమితాబ్, నయన, తమన్నా, విజయ్ సేతుపతి, సుదీప్‌లకు డైలాగులు చెప్పే అవకాశం ఇవ్వలేదు. ఈసారి మాత్రం తలొక డైలాగ్ అప్పగించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్‌కి మరింత బలాన్ని అందించింది. విజువల్ పరంగా సైరా ఎలాంటి లోటూ చేయడం లేదని అర్థమైపోయింది. కంటెంట్ కూడా కలిస్తే.. సైరా బాహుబలి రికార్డుల్ని చెరిపేయొచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.