హఠాత్తుగా ఈటెల రాజేందర్ పై కెసిఆర్ అనుకూల మీడియాలో వచ్చిన కబ్జా వార్తలు తెలంగాణ ప్రజలను నివ్వెరపరిచాయి. ప్రస్తుత మీడియా ప్రజల వద్ద విశ్వాసం పూర్తిగా కోల్పోవడంతో ఈ వార్తలన్నీ, ఈటెల రాజేందర్ ని తొక్కడానికి అధికార టీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలే అని ప్రజలు భావించారు. అయితే ఈటెల రాజేందర్ పై ఇటు కాంగ్రెస్ అటు బిజెపి నేతల నుండి సానుభూతి పెల్లుబుకుతోంది. వివరాల్లోకి వెళితే..
గతంలో కాంగ్రెస్ నేతగా ఉండి ఇటీవల బీజేపీ నేత గా మారిన విజయశాంతి ఈటెల రాజేందర్ వ్యవహారంపై స్పందించారు. ఆవిడ ట్వీట్ చేస్తూ, “లక్ష కోట్లు మింగిన ఈ దొర కుటుంబం బడుగు బలహీన వర్గాలపై చేస్తున్న అణచివేతల ప్రక్రియలో తమ్ముడు ఈటెల రాజేందర్ గారిది మరో దుర్మార్గం. తెలంగాణ ప్రజలకు ఈ దొర అహంకారపు ధోరణుల నుండి త్వరలో విముక్తి తప్పక లభించి తీరుతుంది.” అని రాసుకొచ్చారు. అయితే గతంలో విజయశాంతి ఇలాగే కేసీఆర్ చేతిలో వెన్నుపోటుకు గురయ్యారని, ఇప్పుడు కెసిఆర్ ఈటెల రాజేందర్ ను కూడా ఇలాగే వెన్నుపోటు పొడుస్తూ ఉండడమే విజయశాంతి సానుభూతికి కారణం అని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా బిజెపి నేత బండి సంజయ్ కూడా ఈటెల రాజేందర్ పై సానుభూతి ప్రకటిస్తూ కెసిఆర్ అరాచకాలను విమర్శించారు.
మరొక పక్క కాంగ్రెస్ నేత వీహెచ్ ఇదే అంశంపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ న్యాయం అన్నది అందరికీ ఒకేలా ఉండాలని, ఇటీవల టిఆర్ఎస్ నేత మల్లారెడ్డి ఆడియో ఆధారాలతో అడ్డంగా దొరికిపోతే ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకొని ప్రభుత్వం బిసి మరియు వెనుకబడిన వర్గాలకు చెందిన నేతలపై మాత్రం ఆధారాలు లేకపోయినా చర్యలకు సిద్ధం అవుతోందని విమర్శించారు. మల్లారెడ్డి పై ఆధారాలు ఉన్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. మరొక పక్క ఇంకొక కాంగ్రెస్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, కెసిఆర్ కుటుంబం చేస్తున్న అక్రమాలపై కూడా ఇదే విధంగా చర్యలు తీసుకోవాలని , కేటీఆర్ పై కూడా ఇటువంటి కబ్జా ఆరోపణలు ఉన్నాయని మరి వాటిపై ఎందుకు చర్య తీసుకోరని ప్రశ్నించారు.
మొత్తం మీద అధికార పార్టీ మంత్రి పై అవినీతి ఆరోపణలు వస్తే, విపక్షాలు మంత్రిపై గురి పెట్టకుండా కెసిఆర్ కుటుంబం పై గురిపెట్టి మంత్రిని సమర్థిస్తూ మాట్లాడడం ఆశ్చర్యకర పరిణామం.