భారతీయ జనతా పార్టీ తెలంగాణ ముఖ్య నేతలు.. గతంలో కడుపులో చల్ల కదలకుండా రాజకీయం చేసేవారు. ప్రెస్మీట్లతో సరిపెట్టేవారు. కానీ ఇప్పుడు మాత్రం.. వారు హైదరాబాద్లో ఉంటున్నది తక్కువ. అందరూ గ్రామాల బాటలోనే ఉన్నారు. దీనికి కారణం… బీజేపీ అధ్యక్షుడు అమిత్ షానే. ఆయన చేసిన సూచనలు.. ఇచ్చిన హెచ్చరికలతో… సభ్యత్వ నమోదు కోసం గ్రామాల బాట పట్టారు. జులై6న నగరానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ బీజేపీ నేతలకు 18లక్షల సభ్యత్వాలను టార్గెట్ పెట్టారు. ఇంతటితో ఆగకుండా బీజేపీ నేతలకు అమిత్ షా దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చారు. 18లక్షల సభ్యత్వాలను ఖచ్చితంగా నమోదు చేయాల్సిందేనని.. లేని పక్షంలో తానే తెలంగాణలో స్వయంగా ఇంటింటికి తిరిగి సభ్యత్వాలను ఇస్తాననటంతో.. బీజేపీ నేతల్లో ఆందోళన మెదలైంది.
మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే.. తెలంగాణ సభ్యత్వంపై జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దీంతో ప్రస్తుతం ఉన్న సభ్యత్వానికి రెండింతల సభ్యత్వాలను నమోదు చేయడమే లక్ష్యంగా నాయకులు సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పటికి ఏడు లక్షల సభ్యత్వం మాత్రమే పూర్తిచేశారు. ఆన్లైన్లో మరో రెండు లక్షల మంది సభ్యత్వం చేసుకున్నట్లు బీజేపీ నేతలు చెపుతున్నారు. అయితే ఆన్లైన్లో సభ్యత్వం పొందిన వారి ఇంటికి వెళ్లి సరిచూడాల్సి ఉంటోంది. ఆగస్ట్ 11తో సభ్యత్వ నమోదుకు గడువు ముగియనున్న నేపథ్యంలో ముఖ్య నాయకులంతా గ్రామల బాట పట్టారు. దీంతో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం బోసిపోతోంది.
అమిత్ షా తన క్రియాశీలక సభ్యత్వాన్ని తెలంగాణలో తీసుకోనున్నారు. దీంతో బీజేపీ నాయకుల్లో బీపీ రోజు రోజుకు పెరుగుతోంది. గత ఏడాది సభ్యత్వ నమోదుకు అమిత్ షా పెట్టిన టార్గెట్ ను తెలంగాణ బీజేపీ చేరుకోలేకపోయింది. అప్పట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ నాయకులకు అక్షింతలు వేసిన విషయాన్ని ఆపార్టీ నేతలు గుర్తుచేసుకుంటున్నారు. ఈసారి ఆ అవకాశం అమిత్ షా కు ఇవ్వకూడదని బీజేపీ నాయకులు పట్టుదలతో ఉన్నారు. అందుకే రేయింబవళ్లు కష్టపడుతున్నారు. మరి అనుకున్నది సాధిస్తారో.. అమిత్ షాతో.. అక్షింతలు మామూలే కదా అని అనుకుంటారో మరి..!