కేంద్ర క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. దీన్లో భాగంగా ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నవారి శాఖల మార్పులు కూడా జరుగుతున్నాయి. కొంతమంది సీనియర్ మంత్రులను పార్టీ అవసరాల పేరుతో మంత్రిత్వ శాఖల నుంచి తప్పిస్తున్నారు. మరికొంతమందిని పనితీరు బాగులేదన్న లెక్కల్లో తప్పిస్తున్నారు. రాబోయే ఏడాదిన్నరలో దేశంలో జరిగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త మిత్రులకు మంత్రి వర్గంలో పెద్దపీట వేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న విస్తరణ.. కేవలం భాజపా రాజకీయ ప్రయోజనాల కోసమే అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతో రాజీనామా చేయించడం ఆసక్తికరంగా మారింది. మంత్రి వర్గ సర్దుబాట్లలో భాగంగానే ఆయనతో రాజీనామా చేయించారని చెబుతున్నారు. దత్తన్న స్థానంలో మురళీధర్ రావుకు క్యాబినెట్ లో బెర్త్ దక్కే అవకాశం ఉంది.
అయితే, ఇది దత్తన్న ఊహించని పరిణామంగానే చెబుతున్నారు. గురువారం నాడు పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో దత్తన్న భేటీ అయ్యారు. ఈ సందర్భంలోనే రాజీనామా చేయాలంటూ అమిత్ షా కోరారట. రాజీనామా చేయించడం వెనక కారణం ఏంటంటే… పనితీరు బాగుండటం లేదనేదే! దత్తన్న చురుగ్గా వ్యవహరించడం లేదనీ, కీలకమైన శాఖ ఇచ్చినప్పటికీ తనదైన ముద్ర వేసుకోలేకపోయారనీ, కొత్తదనం ప్రదర్శించలేకపోయారనేది భాజపా లెక్క. ఆయనకు గవర్నర్ పోస్టు ఇవ్వబోతున్నట్టు కూడా భరోసా కల్పించారని సమాచారం. అయితే, అది ఎప్పట్లోగా అనేది తెలీదు! తెలంగాణలో భాజపాని విస్తరింపజేయాలనుకునే మూడ్ లో భాజపా ఉంది కదా! ఇలాంటి తరుణంలో తెలంగాణకు చెందిన సీనియర్ నేతతో రాజీనామా చేయిస్తే.. ఆ ఫలితం ఎంతో కొంత రాష్ట్ర కేడర్ పై పడుతుందనేది వాస్తవం.
నిజానికి, దత్తన్నపై ఎలాంటి అవినీతి ఆరోపణలూ లేవు. సీనియర్ నేతగా తెలంగాణలో ఆయనకు చాలా గౌరవం ఉంది. వయసు ఎక్కువైపోయిందనో, లేదా తెలంగాణ నుంచి మరొకరికి అవకాశం ఇవ్వాలనే కారణంతోనే ఆయన్ని తొలగించడం సరైన వ్యూహం కాదనేది విశ్లేషకుల మాట. ఆయన తొలగింపు ప్రభావం రాష్ట్ర భాజపాపై కచ్చితంగా ఉంటుంది. పార్టీకి ఎంత చేసినా.. ఇదిగో చివరికి పరిస్థితి ఇలానే ఉంటుందనీ, అవసరం తీరిపోయాక కరివేపాకు మాదిరిగా పక్కన పెట్టేస్తారనే అభిప్రాయం కేడర్ లో కలుగుతుంది. అలాంటప్పుడు, నూటికి నూరు శాతం నిబద్ధతతో పార్టీ కోసం పనిచేయాలన్న మోటివేషన్ ఎలా వస్తుంది..? రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు దృష్ట్యా ఆలోచించినా కూడా ఆయన్ని కొనసాగిస్తేనే బాగుండేదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇక, పనితీరు, వయసు, చురుకుదనం వగైరా వగైరా కొలమానాలన్నీ ఒకర్ని తొలగించాలని నిర్ణయం తీసుకున్నాకనే తెరమీదికి వస్తాయి. అదే ప్రాతిపదిక అనుకుంటే కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు కూడా శాఖ మారుతుందని అనుకున్నారు. కానీ, అలా జరగలేదే..! ఏదేమైనా, దత్తన్నతో రాజీనామా చేయించడం తొందరపాటు చర్యే అని రాష్ట్ర భాజపా వర్గాల్లోనే ఓ అభిప్రాయం వినిపిస్తోంది.