మన దేశంలో రాజకీయ పార్టీలు ఏదైనా ఒక సమస్య ఉత్పన్నం అయితే దాని పరిష్కారం కోసం కాక, ఆ సమస్యని పట్టుకొని విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకొంటూ కాలక్షేపం చేస్తుంటాయి. పాతబస్తీలో ఐసిస్ ఉగ్రవాదులని ఎన్.ఐ.ఏ. అరెస్ట్ చేసి, వారి కుట్రలు భగ్నం చేసి వారి నుండి ప్రేలుడు సామాగ్రి వశపరుచుకొంటే, ప్రజలని అప్రమత్తం చేయవలసిన మన రాజకీయ పార్టీలు, ఆ పరిణామాలని రాజకీయ ఆయుధాలుగా చేసుకొని తమ ప్రత్యర్ధులపై ప్రయోగిస్తున్నాయి. భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్ మజ్లీస్, తెరాసల బంధాల గురించి ప్రశ్నిస్తే, ప్రతిపక్ష పార్టీలు దీనిపై రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నాయని తెరాస నేతలు విమర్శిస్తున్నారు.
రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డా.లక్ష్మణ్ మజ్లీస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఎన్.ఐ.ఏ. అరెస్ట్ చేసిన ఉగ్రవాదులకి అవసరమయితే న్యాయసహాయం చేస్తానని మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. దానిపై ఆయన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులకి మద్దతు ఇస్తున్న అటువంటి పార్టీతో తెరాస స్నేహం చేస్తోంది కనుకనే పరిస్థితి ఇంతవరకు వచ్చిందని, ఒకవేళ ఎన్.ఐ.ఏ.సకాలంలో ఉగ్రవాదులని అరెస్ట్ చేయలేకపోయుంటే చాలా దారుణం జరిగి ఉండేదని అన్నారు.
మనదేశంలో అజ్మల్ కసాబ్, అఫ్జల్ గురు, యాకూబ్ మీమన్, సామూహిక అత్యాచారాలకి పాల్పడిన వారికి మద్దతు తెలిపే రాజకీయ నేతలు ఉన్నారు. వారి తరపున వాదించేందుకు చాలా మంది న్యాయవాదులు ఉన్నారు. ఒక నరహంతకుడిని కాపాడేందుకు అర్ధరాత్రి సుప్రీం కోర్టు తలుపుతట్టి వాదించే గొప్ప న్యాయవాదులున్నారు మనకి. ఆ హంతకుల కుటుంబాలకి రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరేవారు కూడా ఉన్నారు. ఆ అలవాటు ప్రకారమే నగరంలో మారణహోమం చేయాలనుకొన్న ఐసిస్ ఉగ్రవాదుల పట్ల మజ్లీస్ అధినేత కరుణ చూపించడం చాలా అవసరమని భావించినట్లున్నారు. ఆ ఉగ్రవాదులు తమ నివాస ప్రాంతమైన చార్మినార్ దగ్గరే బాంబులతో దాడులు చేయాలనుకొన్నా క్షమించగల గొప్ప మనసుందని అసదుద్దీన్ నిరూపించుకొన్నారు.
ఇక్కడ ప్రధాన సమస్య హైదరాబాద్ నగరంలో చాప క్రింద నీరులాగ ఉగ్రవాదం వ్యాపిస్తుండటం. దానిని ఏవిధంగా అరికట్టాలి? అని ఏ రాజకీయ నేత మాట్లాడటం లేదు. అందుకోసం ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వాలని అనుకోలేదు? ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలని, ప్రజా సంఘాలని, మేధావులని సమావేశపరిచి ఈ సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా చేసేందుకు తగిన పరిష్కార మార్గాలు, సలహాలు, సూచనలు కోర(లే)దు. ఎందుకంటే అందరూ కూడా ఇది పోలీసులకి సంబంధించిన సమస్య అని భావించడమే కారణం. కానీ అందరూ కూడా తమకి సంబంధం లేదనుకొంటున్న ఈ సమస్య గురించి గట్టిగా మాట్లాడుతూనే ఉంటారు. అందరూ మాట్లాడుతున్నా సమస్యకి పరిష్కారం మాత్రం దొరకదు. దాని కోసం ఎవరూ ఆలోచించరు కూడా.