తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలను పునర్విభజించి, కొత్తగా మరో 15 జిల్లాలు ఏర్పాటు చేయడానికి సిద్దం అవుతున్నారు. వచ్చే నెల 2న రాష్ట్రావతారణ సందర్భంగా కొత్త జిల్లాల పేర్లను, వాటి వివరాలను ప్రకటిస్తానని చెప్పారు. ఈ ఏడాది ఆగస్ట్ 15నాటి నుంచి కొత్త జిల్లాలు అన్నీ పూర్తి హంగులతో పనిచేయడం ప్రారంభిస్తాయని కూడా చెప్పారు. కొత్త జిల్లాల కోసం సివిల్, పోలీస్ అధికారుల ఏర్పాటు, వారి కోసం కార్యాలయాలు కూడా అప్పటిలోగా సిద్ధం అవుతాయని కేసీఆర్ తెలిపారు. పరిపాలనా వికేంద్రీకరణ, సౌలభ్యం కోసమే జిల్లాలను పునర్విభజిస్తున్నట్లు తెలిపారు.
కానీ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అందుకు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీకి మేలు చేకూర్చేవిధంగా జిల్లాలను, జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేసుకొంటున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇంత ముఖ్యమైన విషయంలో కూడా కేసీఆర్ తమను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని తప్పుపడుతున్నాయి.
ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న గద్వాల్ ని విడదీసి గద్వాల్ కేంద్రంగా జిల్లాని ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి డికె అరుణ డిమాండ్ చేస్తున్నారు. కానీ తెరాస ప్రభుత్వం వనపర్తి కేంద్రంగా జిల్లాని ఏర్పాటు చేయడానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అలా చేస్తే తాము ఊరుకోమని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోనియా గాంధీ తెలంగాణా రాష్ట్రాన్ని ప్రజల కోసం ఇచ్చారని కేసీఆర్ కోసం కాదని ఆమె అన్నారు. కనుక రాష్ట్రాన్ని, జిల్లాలను తన ఇష్టం వచ్చినట్లు విడగొడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ కూడా ఈ విషయంలో కేసీఆర్ వైఖరిని తప్పు పట్టారు. “రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను ఏవిధంగా ఎదుర్కోవాలని ఆలోచించకుండా, కేసీఆర్ ఎప్పుడూ ఎన్నికలు, ఓట్లు, ఫిరాయింపుల గురించే ఆలోచిస్తుంటారు. కరువు సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికే ఆయన అకస్మాత్తుగా ఈ జిల్లాల పునర్విభజన అంశాన్ని ముందుకు తీసుకు వచ్చారు. కరువు సహాయం క్రింద కేంద్రం రూ. 791 కోట్లు ఇస్తే కేసీఆర్ దానిని ఖర్చు చేయకుండా సచివాలయం పునర్నిర్మాణం వంటి అప్రస్తుతమైన విషయాల గురించి ఆలోచిస్తుంటారు. తక్షణమే కరువు సహాయ చర్యలు చేపట్టాలి. లేకపోతే మేము ఉద్యమించవలసి వస్తుంది” అని హెచ్చరించారు.
తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు కూడా నల్గొండ జిల్లాని విభజిస్తున్నప్పుడు యాదాద్రిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతున్నారు. లేకుంటే దాని కోసం ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లా, మంధని కేంద్రాలుగా జిల్లాలు ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా సాధన సమితులు నిన్న సిరిసిల్లాలో మానేరు బ్రిడ్జి వద్ద విద్యార్ధి, ప్రజా సంఘాలతో కలిసి రాస్తారోకో నిర్వహించాయి. ఇంకా మిగిలిన జిల్లాలలో కూడా ఇటువంటి సమస్యలున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో యూపియే ప్రభుత్వం ఏవిధంగా ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి ఒత్తిళ్ళు ఎదుర్కొందో, ఇప్పుడు తెలంగాణాలో జిల్లాల పునర్విభజనలో కూడా తెరాస ప్రభుత్వం అటువంటి సమస్యలు, ఒత్తిళ్ళే ఎదుర్కోవలసి రావడం విచిత్రంగానే ఉంది. కానీ రాష్ట్ర విభజనతో పోలిస్తే అవేమీ పెద్ద సమస్యలు కావనే చెప్పవచ్చు.