తెలంగాణ బిజెపి అద్యక్షుడుగా ఎంఎల్‌సి ఎస్.రామచంద్రరావు ఎంపిక దాదాపు ఖాయమైనట్టు తెలుస్తున్నది. ప్రస్తుత అద్యక్షుడు కిషన్‌రెడ్డి పదవీ కాలం ముగియనుండటంతో తదుపరి సారథి ఎవరనే వూహాగానాలు నడుస్తున్నాయి. డా.కె.లక్ష్మణ్ పేరు కూడా ప్రముఖంగా వినిపించినా కిషన్ రెడ్డి వుండగానే ఆయన శాసనసభా పక్ష నేతగా వున్నారు గనక ఇప్పుడు తాను కూడా ఏదో ఒకటి ఎంచుకోవలసిన పరిస్థితి. వున్న పదవిలో కొనసాగడానికే ఆయన మొగ్గు చూపుతున్నారు. దాంతో సీనియర్ నాయకుడైన రామచంద్రరావుకు అవకాశాలు బాగా పెరిగాయి. వివాద రహితుడుగానూ, ఢిల్లీలో మంచి సంబంధాలు గల వ్యక్తిగానూ ఆయనకు పేరుంది. గత ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తును ఖరారు చేయడంలో ఆయన ముఖ్యపాత్ర వహించారు. ఈ వార్తలను ఖండించనప్పటికీ మరో పదిరోజులు ఆగితేనే మరెవరైనా వస్తారా లేదా అనేది తెలుస్తుందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఉన్నంతలో మరెవరూ కనిపించడం లేదు గనక ఆయననే అధిష్టానం కూడా ఆమోదిస్తుందని భావిస్తున్నారు. బార్‌కౌన్సిల్ సభ్యుడుగానూ న్యాయవాదిగానూ అందరికీ పరిచితుడైన రామచంద్రరావు శాసనమండలి ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ఉద్యోగ నేత దేవీ ప్రసాద్‌ను ఓడించి ఘన విజయంసాధించడం ఒక రాజకీయ సంచలనమైంది. అంతకు ముందు కూడా ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై చాలా స్వల్ప తేడాతోనే ఓడిపోయి కేసునడిపించారు. దీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఆయన ఎంపికపెద్ద ఆశ్చర్యం కాదని బిజెపి వర్గాలు భావిస్తున్నాయి. అయితే తమ పార్టీలో ఎవరు పదవిలోకి వచ్చినా పాత వారంతా కూడా పార్టీలోపలా బయిటా వేదికలు నింపేస్తుంటారనే అసంతృప్తి బిజెపిలో వుంది. ఈ కారణంగానే కొత్త నేతలు చొరవగా పనిచేసేందుకు వీలుండదని వారు వాపోతున్నారు. ఇప్పుడైనా ఆ ధోరణి మారుతుందా అనేది చూడాలి. రామచంద్రరావు అద్యక్షుడైతే టిడిపితో సంబంధాలు తెంచుకోవడానికి తొందరపడబోరని అంటున్నారు.